English | Telugu

పంతం.. నీదా..నాదా.. సై..

ఏ రంగంలోనైనా పోటీ లేకపోతే... మజాగా ఉండదు. చూసేవాళ్లలో ఆసక్తి రగలాలన్నా... చేసేవాళ్లు ఎదగాలన్నా.. పోటీ అనివార్యం. ముఖ్యంగా సినిమా రంగం అయితే.. పోటీ మీదే నడుస్తుంటుంది. సినిమాల మధ్య పోటీ.. హీరోల మధ్య పోటీ.. అంతా పోటీ..పోటీ.. పోటీ..

ఒకప్పుడు జగపతిబాబు, శ్రీకాంత్ మధ్య ఇలాంటి పోటీనే ఉండేది. ఇది 90ల్లో మాటలేండి. ఓ వైపు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకేటేశ్ అగ్ర హీరోలుగా హవా సాగిస్తుంటే... మరో వైపు చిన్న సినిమా సూపర్ స్టార్లుగా జగపతిబాబు, శ్రీకాంత్ వెలిగిపోతుండేవారు. నువ్వా - నేనా అనే రీతిలో ఉండేవి వీళ్ల పోటీ. కాలం పరుగులెత్తింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్..  ఇంకా అగ్ర హీరోలుగానే చలామణీ అవుతున్నారు. కానీ.. వాళ్లకంటే చిన్నవారైన జగపతిబాబు, శ్రీకాంత్ మాత్రం కుర్ర హీరోల ధాటికి వెనకబడిపోయారు. 

జగపతిబాబు కాస్త తెలివిగా ఆలోచించి ‘లెజెండ్’తో విలన్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం స్టార్ విలన్ అంటే జగపతిబాబే. జగ్గుభాయ్ విలన్ అయ్యాక... అంతకు ముందు విలన్ గా చలామణి అయిన చాలామంది ఇంటికెళ్లారు. ప్రస్తుతం అగ్ర హీరో సినిమా అంటే.. జగ్గూభాయే విలన్. ఇలాంటి తరుణంలో ‘యుద్ధం శరణం’ చిత్రంతో శ్రీకాంత్ కూడా విలన్ గా మారాడు. మొన్నటిదాకా కేరక్టర్ ఆర్టిస్ట్ గా పాజిటీవ్ కేరక్టర్లు చేసిన శ్రీకాంత్..  ఇప్పుడు ఒక్కసారిగా విలన్ అవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

90ల్లో హీరోగా జగ్గూభాయ్ కి మంచి పోటీ ఇచ్చిన శ్రీకాంత్... ఇప్పుడు విలన్ గా కూడా పోటీ ఇవ్వగలడా? అనేది చాలామంది ప్రశ్న. నిజానికి జగ్గూభాయ్ విలన్ అయ్యాక... అతని రూపురేఖలే మారిపోయాయ్. అప్పట్లో హీరోగా సాత్వికమైన పాత్రలే ఎక్కువ పోషించాడు జగపతిబాబు. ఆయనది శోభన్ బాబు ఇమేజ్. అలాంటి జగ్గూభాయ్... ఒక్కసారిగా విలన్ గా మారి క్రూరత్వానికి పీక్ లెవల్స్ తెరపై చూపిస్తున్నాడు. ఇక శ్రీకాంత్... విలనీ తనకు కొత్త కాదు. హీరో కాకముందు శ్రీకాంత్ విలన్. వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అబ్బాయిగారు, సీతారత్నంగారి అబ్బాయ్.. ఇలా చాలా సినిమాల్లో విలన్ గా మెప్పించాడు. 

సో... దాచి పెట్టిన కత్తికి మళ్లీ నూనె పూసి సానపట్టి ‘యుద్ధం శరణం’ అంటూ రంగంలోకి దిగుతున్నాడు. మరి రాబోతున్న వీరి యుద్ధంలో.. గెలుపెవరిది? శ్రీకాంత్ దా? జగ్గూభాయ్ దా? కాలమే సమాధానం చెప్పాలి.