Read more!

English | Telugu

'తీస్ మార్ ఖాన్'.. ఆది ప్లాప్ లకు బ్రేక్ పడేనా?

డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా 'ప్రేమ కావాలి'(2011) సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్ ఈ 11 ఏళ్లలో 15కి పైగా సినిమాలు చేశాడు. కానీ మొదటి రెండు సినిమాలు 'ప్రేమ కావాలి', 'లవ్ లీ'(2012) మినహా చెప్పుకోదగ్గ విజయాలను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. దాదాపు పదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. రేపు(ఆగస్టు 19) విడుదలవుతున్న 'తీస్ మార్ ఖాన్' చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

 

ఆది హీరోగా కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'తీస్ మార్ ఖాన్'. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తామని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. అయితే ఇటీవల మీడియం రేంజ్ హీరోలు చేసిన 'పక్కా కమర్షియల్', 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' వంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నెగటివ్ టాక్ తెచ్చుకోగా.. 'బింబిసార', 'సీతా రామం', 'కార్తికేయ-2' వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఆది నటించిన యాక్షన్ ఫిల్మ్ 'తీస్ మార్ ఖాన్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 

ఇదిలా ఉంటే ఫలితాలు ఎలా ఉన్నా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆది. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.