Read more!

English | Telugu

కెప్టెన్ ని మర్చిపోలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న విశాల్‌!

కోలీవుడ్‌ నటుల్లో హీరో విశాల్‌ సినీ కళాకారుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటాడు. వారికి ఎదురయ్యే సమస్యల పట్ల తన వాణిని వినిపిస్తుంటాడు. ప్రస్తుతం నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌, సెక్రటరీగా విశాల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. గతంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన విశాల్‌ తన హయాంలో సంఘం కోసం తనే సొంతంగా భవనం నిర్మిస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే భవనం పూర్తి కానుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భవనాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడు విశాల్‌. ఈ భవనానికి కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ పేరు పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. ‘కెప్టెన్‌ మనమధ్య లేకపోయినా మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఈ సంఘం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. సాధారణంగా అలాంటి వ్యక్తుల్ని కోల్పోయిన తర్వాత మనం దేవుడిగా కొలుస్తాం. కానీ, విజయ్‌కాంత్‌గారు జీవించి ఉన్నప్పుడే ఆయన్ని దేవుడిగా భావించారంతా. నటీనటులకు కెప్టెన్‌ ఎంతో మేలు చేశారు. పేద కళాకారులను ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అందుకే నడిగర్‌ సంఘం భవనానికి విజయ్‌కాంత్‌గారి పేరు పెట్టాలనే డిమాండ్‌ కూడా బాగా ఉంది. ఈ విషయాన్ని కొంతమంది స్టార్స్‌ కూడా ఓపెన్‌గా చెప్పారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం భవనానికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు విశాల్‌.