English | Telugu

సుకుమార్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ..?

ఎట్టకేలకు 'పుష్ప-2' థియేటర్లలో అడుగుపెట్టింది. కొందరు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే, మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. మొత్తానికైతే ఇది సుకుమార్ తన లాజిక్ లను పక్కన పెట్టి తీసిన పక్కా కమర్షియల్ సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే 'పుష్ప-2' విషయంలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. (Pushpa 2 The Rule)

'పుష్ప-2' మూవీపై అంచనాలు పెరగడానికి ఓ రకంగా పునాది వేసింది.. గతేడాది ఏప్రిల్ లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'Where is Pushpa?' పేరుతో విడుదలైన గ్లింప్స్ అని చెప్పవచ్చు. తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడని.. అతనిపై పది రౌండ్ల కాల్పులు జరిగాయని, బ్రతికే అవకాశం లేదని వార్తల్లో చెబుతున్నట్టుగా గ్లింప్స్ లో చూపించారు. పుష్ప మరణించాడన్న వార్తలతో అతని మద్దతుదారులు చేసే విధ్వంసం, ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, పోలీసులు 144 సెక్షన్ విధించడం వంటివి కూడా గ్లింప్స్ లో చూపించారు. ఇక అటవీప్రాంతంలో పులులు జాడ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పుష్ప ఆచూకీ తెలుస్తుంది. "అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం" అనే డైలాగ్ తో పుష్పరాజ్ పాత్రను రివీల్ చేసిన తీరు అదిరిపోయింది. ఈ ఒక్క గ్లింప్స్ తో 'పుష్ప-2'పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే విచిత్రం ఏంటంటే.. అసలు సినిమాలో ఆ గ్లింప్స్ లోని సన్నివేశాలే లేవు. 'పుష్ప-2' కోసం ముందుగా వేరే కథ అనుకొని, ఆ తర్వాత కథని మార్చారా? లేక ఈ సన్నివేశాలు 'పుష్ప పార్ట్-3'లో చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

'Where is Pushpa?' గ్లింప్స్ లోని సీన్స్ మాత్రమే కాదు, ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్స్ కూడా సినిమాలో కనిపించలేదు. పుష్ప-2 లో జపాన్ పోర్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పుష్పరాజ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత సినిమాలో జపాన్ ఊసే ఉండదు. కానీ ట్రైలర్ లో మాత్రం జపాన్ తాలూకు ఇతర సన్నివేశాల విజువల్స్ కనిపిస్తాయి. అలాగే ట్రైలర్ లో జాలిరెడ్డి ఎవరికో గన్ గురి పెడతాడు. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు. ట్రైలర్ లో పుష్ప శివమాలలో దర్శనమిచ్చిన విజువల్స్ కూడా.. సినిమాలో ఉండవు. అలాగే సినిమాలో రెండు పెద్ద బ్లాస్ట్ లు జరుగుతాయి. వాటిని ఎవరు చేశారనే ప్రశ్నలను అలాగే వదిలేశారు. వీటన్నంటికీ పుష్ప పార్ట్-3 లో సమాధానం దొరికే అవకాశముంది. అయితే అసలు సుకుమార్.. ఇలా పార్ట్-3 కోసం అన్నట్టుగా కథని డ్రాగ్ చేయకుండా, పార్ట్-2 తోనే ముగిస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.