English | Telugu

సునీల్ ని త్రివిక్రమ్ ఎందుకు వదిలేశాడు?

 

త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్... ఒకనాటి ప్రాణ స్నేహతులు.  ఇద్దరూ గోదావరి జిల్లావాళ్లే. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో  హైదరాబాద్ పంజాగుట్ట లోని ఓ చిన్న రూమ్ లో ఇద్దరూ అద్దెకుండేవారు. రైటర్ గా ఎదగడం త్రివిక్రమ్ లక్ష్యం. నటుడవ్వడం సునీల్ లక్ష్యం.

కాల క్రమంలో త్రివిక్రమ్ స్టార్ రైటర్ అయ్యాడు. సునీల్ హాస్య నటుడు అనిపించుకున్నాడు. తాను రాసే సినిమాల్లో సునీల్ కోసం కచ్చితంగా  ఏదో ఒక పాత్ర రాసేవాడు త్రివిక్రమ్. ఓ విధంగా సునీల్ స్టార్ కమెడియన్ అయ్యాడంటే దాంట్లో త్రివిక్రమ్ పాత్ర పెద్దదే.

తర్వాత కాలంలో త్రివిక్రమ్ సక్సెస్ ఫుల్ దర్శకుడయ్యాడు. ‘అందాల రాముడు’తో సునీల్ హీరోగా మారాడు. రాజమౌళి ‘మర్యాద రామన్న’ చిత్రం సునీల్ కి హీరోగా భారీ విజయాన్నిచ్చింది. ఇక అక్కడ్నుంచి సిక్స్ ప్యాక్ చేసి హీరోగా కూడా సత్తా చాటాలని సునీల్ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన ‘పూలరంగడు’ కూడా తనకు మంచి విజయాన్నిచ్చింది. కానీ..  ఆ తర్వాత వచ్చిన సినిమాలే ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు మళ్లీ కెమెడియన్ గా మారలేడు. హీరోగా సక్సెస్ లేదు. దీంతో రెండిటికీ చెడ్డ
రేవడిలా తయారయ్యింది సునీల్ పరిస్థితి.

అయితే... త్రివిక్రమ్ మాత్రం దర్శకుడిగా దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు. మరి ఇలాంటి తరుణంలో తన చిరకాల మిత్రుడైన సునీల్ తో త్రివిక్రమ్ ఎందుకు సినిమా తీయకూడదు? ఇది చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అంటే మార్కెట్ కు లోటుండదు. హీరోతో కూడా నిమిత్తం లేకుండా సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇలాంటి తరుణంలో స్నేహ ధర్మాన్ని పాటించి.. సునీల్ హీరోగా ఓ సినిమా చేయొచ్చు కదా! ఎందుకు సునీల్ ని వదిలేశాడు?

ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరే ఇవ్వగలరు. ఒకరు త్రివిక్రమ్. రెండు.. ఆ దేవుడు.