Read more!

English | Telugu

రేపు రిలీజ్ అవుతున్న సినిమాలు

అన్ సీజన్లో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలూ రావడానికి ఆసక్తి చూపించవు. అందుకే అలాంటి టైంలో చిన్న సినిమాలన్నీ ఒకేసారి థియేటర్ల మీదకు దూకి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాయి. గత కొద్ది వారాలుగా ఇదే జరుగుతోంది. ప్రతీ శుక్రవారం కనీసం డజన్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉంటున్నాయి. థియేటర్ల కొరత అని ఇబ్బంది పడినా, ఇది ఇండస్ట్రీకి మాత్రం మంచే చేస్తుంది. ఇక ఈ వారం కూడా ఆరు చిన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, ఒకటి మాత్రం తమిళ డబ్బింగ్ సినిమా.

దృశ్యకావ్యం

రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా, పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం చేస్తూ నిర్మించిన సినిమా దృశ్యకావ్యం. ప్రాణం, వాన లాంటి సినిమాలకు సంగీతాన్నందించిన కమలాకర్, ఈ సినిమాకు సంగీతాన్నివ్వడం విశేషం. హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ ప్రేమకథ, ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

సీసా

హీరో శివాజీ చాలా కాలం తర్వాత చేసిన సినిమా సీసా. సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ జానర్స్ అన్నింటిని కలిపి సీసా తీశామని చెబుతున్నారు నిర్మాతలు. సినిమా అంతా సింగిల్ టేక్ లో సింగిల్ షాట్ లో తీయడం విశేషం. పెద్దగా ప్రచారకార్యక్రమాలు కూడా పెట్టుకోలేదు సీసా టీం. రిజల్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

దండకారణ్యం

ఆర్.నారాయణమూర్తికి సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమాలు హిట్టైనా, ఫ్లాపైనా ఆయనకు సంబంధం ఉండదు. ఆయన తీస్తూనే ఉంటారు. వీళ్లు చూస్తూనే ఉంటారు. మరోసారి తన విప్లవ బావుటా ఎగరేయడానికి దండకారణ్యం పేరుతో నారాయణమూర్తి వస్తున్నారు. ఈరోజుల్లో ఆయన విప్లవం ఏమేరకు రాణిస్తుందో రేపు తెలుస్తుంది.

రొమాన్స్ విత్ ఫైనాన్స్ 

సతీష్ బాబు, మెరీనా అబ్రహాం జంటగా రిషి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై జనార్ధన్ మందుముల తెరకెక్కించిన సినిమా రొమాన్స్ విత్ ఫైనాన్స్. రాజు కుంపట్ల దర్శకుడు. ప్రేమ వెనుక రొమాన్స్, దాని వెనుక ఉన్న ఫైనాన్స్ మధ్య రిలేషన్ ను చూపించాం అంటున్నారు మూవీ టీం. కొత్తవాళ్లతో వస్తున్న ఈ లవ్ స్టోరీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

సతీ తిమ్మమాంబ

హిస్టారికల్ అండ్ స్పిరిచ్యువల్ మూవీగా తెరకెక్కింది సతీ తిమ్మాంబ. ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రధానపాత్రలో బాలగొండ ఆంజనేయులు దీన్ని తెరకెక్కించారు. అనంతపురంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు నిర్మాతలు చెబుతున్నారు. రంగనాథ్, వినోద్ కుమార్, ప్రభాకర్ ప్రథాన పాత్రలు పోషించారు.

కథకళి

పాండిరాజ్ డైరెక్షన్లో విశాల్ హీరోగా వస్తున్న డబ్బింగ్ సినిమా కథకళి. అక్కడ మంచి పేరు తెచ్చుకున్నా కలెక్షన్ల దగ్గర ఇబ్బంది పడిందీ సినిమా. కానీ ఓ మాదిరి టైంపాస్ మూవీ అయితే మాత్రం, ఉన్న సినిమాలన్నింటిలోనూ ఇదే బాగా ఆడుతుందని చెప్పచ్చు. అన్ని సినిమాల్లోకీ కాస్త మాస్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ విశాల్ కు మాత్రమే ఉన్నాయి. దీంతో హిట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విశాల్.