Read more!

English | Telugu

వెంకీ, త్రిష హేట్రిక్ కొడతారా...!

వెంకీ, త్రిష హేట్రిక్ కొడతారా...! అన్నది ఫిలిం నగర్ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. వివరాల్లోకి వెళితే విక్టరీ వెంకటేష్, త్రిష కలసి గతంలో శ్రీ రాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వంలో, "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" అనే చిత్రంలోనూ, శ్రీను వైట్ల దర్శకత్వంలో "నమో వేంకటేశ" అనే చిత్రంలోనూ నటించారు. వీటిలో తొలిచిత్రం సూపర్ హిట్టయింది. మలిచిత్రం సగటు స్థాయిలోనే ఆడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలసి శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, "డాన్ శీను" వంటి హిట్ చిత్రాన్నందించిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.

మళయాళంలో సూపర్ హిట్టయిన "బాడీ గార్డ్" అనే సినిమాని ముందుగా తమిళంలో అదే పేరుతో విజయ్, ఆశిన్ జంటగా నిర్మించగా అది సూపర్ హిట్టయ్యింది. అదే సినిమాని తెలుగులో వెంకీ, త్రిష జంటగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రిప్ట్ అందిస్తూండగా, యువ సంగీత దర్శకుడు తమన్ సాయి సంగీతాన్నందిస్తున్నారు. ఇక్కడ విషయమేమిటంటే ఇది వెంకీ, త్రిషల కాంబినేషన్ లో వస్తున్న హేట్రిక్ సినిమా. మరి వెంకీ, త్రిష హేట్రిక్ కొడతారా...? లేదా...? అన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.