English | Telugu

టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలు అనేది చాలా చిన్న విషయం.. తేల్చేసిన దిల్‌రాజు!

ఇటీవల జరిగిన కొన్ని ఘటనల కారణంగా ప్రజల్లో రకరకాల అపోహలు నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య గ్యాప్‌ పెరిగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు చర్చించిన అంశాల గురించి దిల్‌ రాజు మీడియాకు తెలియజేశారు.

‘ఇప్పుడు తెలుగు సినిమాకి ఇండియా లెవల్‌లో మంచి గౌరవం దక్కుతోంది. మన సినిమాలకు అక్కడ ఆదరణ బాగా ఉంటోంది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేందుకు ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలనేది మొదటి అంశంగా డిస్కస్‌ చేయడం జరిగింది. హైదరాబాద్‌లో తెలుగు సినిమాలే కాకుండా ఇండియాలోని ఇతర భాషా చిత్రాలు కూడా షూటింగ్స్‌ జరుపుకుంటున్నాయి. హాలీవుడ్‌ సినిమాలు కూడా ఇక్కడ నిర్మాణం జరుపుకోవాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రిగారు అడిగారు. వారు షూటింగ్‌ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ మనం కల్పిస్తామని చెప్పారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్‌ని ఒక ఇంటర్నేషనల్‌ హబ్‌ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చెయ్యాలన్నది ముఖ్యమంత్రిగారి ఆలోచన. తర్వాతి అంశం.. డ్రగ్స్‌కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, అలాగే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, యూత్‌కి, సొసైటీకి ఉపయోగపడే విషయాల్లో సినిమా ఇండస్ట్రీ తోడ్పాటు కావాలని అడిగారు. దానికి ఇండస్ట్రీ ఆమోదం తెలియజేసింది. ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి చేసే కార్యక్రమాలకు ఒక కమిటీ వేయబోతున్నారు. ఇందులో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా ఉంటారు. 

టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌  షోల గురించి అడుగుతున్నారు. అయితే ఈ టాపిక్‌ ఇప్పుడు చాలా చిన్నది. ఎందుకంటే తెలుగు సినిమాని పెద్ద స్థాయిలో ప్రజెంట్‌ చెయ్యాలన్నది సీఎం గారి ఆలోచన. ఆ దిశగానే ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ పెద్ద విషయాలు. టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు అనేవి చాలా చిన్న విషయాలు. సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్‌ అవుతాయి. కానీ, మన సినిమాని ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది మా ప్రధాన ఎజెండా’ అన్నారు దిల్‌ రాజు.