English | Telugu

‘భారతీయుడు3’ రిలీజ్‌పై షాకింగ్‌ అప్‌డేట్‌.. చివరికి శంకర్‌కి  ఈ దుస్థితి వచ్చిందా!

ఇండియాలో వున్న టాప్‌ డైరెక్టర్స్‌లో శంకర్‌కి ఉన్న ప్రత్యేకత వేరు. భారీతనానికి,  టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు. జెంటిల్‌మెన్‌తో డైరెక్టర్‌గా పరిచయమైన శంకర్‌ ఆ తర్వాత ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ని ప్రేక్షకులకు అందించారు. ‘రోబో’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత శంకర్‌ కెరీర్‌ మందగించింది. ఆ సినిమా తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచాయి. 1996లో కమల్‌హాసన్‌తో చేసిన ‘భారతీయుడు’ ఆరోజుల్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అదే కాన్సెప్ట్‌తో చేసిన ‘భారతీయుడు2’తో మరింత వెనకబడిపోయారు శంకర్‌. దీంతో రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై ఆ ప్రభావం తప్పక ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. శంకర్‌లో ఒకప్పటి స్టాండర్డ్స్‌ ఇప్పుడు లేవు అన్నది అందరి అభిప్రాయం. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ‘భారతీయుడు2’ చిత్రంతో ప్రేక్షకులకు పెద్ద షాక్‌ ఇచ్చిన శంకర్‌ సినిమా చివరలో ‘భారతీయుడు3’ వార్‌ మోడ్‌ పేరుతో ఓ ట్రైలర్‌ను యాడ్‌ చేశారు. అయితే ఈ ట్రైలర్‌కి కూడా ఆశించిన స్పందన రాలేదని మేకర్స్‌ ఫీల్‌ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌తోపాటు మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా వుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌పై ఒక ఆసక్తికరమైన విషయం సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. అదేమిటంటే.. ‘భారతీయుడు3’ చిత్రం థియేటర్లలో రిలీజ్‌ కావడం లేదని, డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని 2025 జనవరిలో రిలీజ్‌ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేశారు. ‘భారతీయుడు3’ ట్రైలర్‌కి సరైన స్పందన రాని కారణంగా థియేటర్లలో సినిమాని రిలీజ్‌ చెయ్యాలన్న ఆలోచనను పక్కన పెట్టారని సమాచారం. 

‘భారతీయుడు2’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ చేస్తోంది. ఇప్పుడు పార్ట్‌ 3ని కూడా అదే సంస్థకు ఫ్యాన్సీ రేటుకి అమ్మినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికిగానీ, రిపబ్లిక్‌ డేకి గానీ సౌత్‌లోని అన్ని భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ చేస్తారని సమాచారం అందుతోంది. ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శంకర్‌ సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయ్యే పరిస్థితి లేదంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘చివరికి నీకీ గతి పట్టిందా..’ అని కొందరు, ‘ఒక కమర్షియల్‌ డైరెక్టర్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు’ అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌కి ఉన్న ఒకే ఒక ఆశ ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ అయితే తప్ప అతని కెరీర్‌ గ్రాఫ్‌కి రెక్కలు రావు అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.