English | Telugu
కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులు.. సంచలనం సృష్టిస్తున్న సంధ్య థియేటర్ లేఖ!
Updated : Dec 13, 2024
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో ఓ కీలక మలుపు చోటు చేసుకుంది. డిసెంబర్ 4 రాత్రి గం.9.30లకు వేసిన ప్రీమియర్‌కు భారీగా ప్రేక్షకులు తరలి రావడంతోపాటు హీరో అల్లు అర్జున్ కూడా అదే సమయంలో థియేటర్‌కి రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఎంత సంచలనం సృషించిందో అందరికీ తెలిసిందే. అయితే హీరో సినిమా చూసేందుకు వస్తున్నారన్న సమాచారం తమకు లేదని మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక స్టార్ హీరో వస్తుంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించాలని, బందో బస్తు కోసం పోలీసులను ఆశ్రయించాలని అందరూ ఉచిత సలహాలు పారేశారు. పోలీసులకు సరైన సమాచారం లేకపోవడం వల్లే అక్కడ సరైన భద్రత ఏర్పాటు చేయలేకపోయారని అందరూ అనుకున్నారు. అది పోలీసుల వైఫల్యం కాదని, ముమ్మాటికీ అల్లు అర్జున్ తప్పిదమేనని ముక్తకంఠంతో అందరూ ఆరోపించారు.
అయితే అది పోలీసుల వైఫల్యమేనని తాజాగా అందిన సమాచారం. సంధ్య థియేటర్ యాజమాన్యం ఈరోజు ఒక లేఖను విడుదల చేసింది. అదేమిటంటే డిసెంబర్ 2న పోలీసులకు థియేటర్ యాజమాన్యం ఒక లేఖ రాసింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ డిసెంబర్ 4 రాత్రి నుంచే షోలు ఉంటాయని, ఆ షో చూసేందుకు హీరో, హీరోయిన్‌తోపాటు కొందరు విఐపిలు, చిత్ర యూనిట్ వస్తుందని, ఆ సమయంలో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. జనాన్ని కంట్రోల్ చేసేందుకు తమకు బందోబస్త్ అవసరమని ఆ లేఖలో పేర్కొంది సంధ్య థియేటర్ యాజమాన్యం. దీన్నిబట్టి ఈ తొక్కిసలాట జరగడంలో, మహిళ మృతి చెందడంలో పూర్తి వైఫల్యం పోలీసులదేనని అర్థమవుతోంది. దీనికి సంధ్య థియేటర్ యాజమాన్యంగానీ, అల్లు అర్జున్‌గానీ కారణం కాదనేది ఆ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో, ఎవరిపై చర్యలు తీసుకుంటుందో చూడాలి.