English | Telugu

గాయపడిన సమంత.. సాధన విషయంలో మంచే జరిగింది!

చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్న సమంతకు మళ్ళీ ఓ సమస్య వచ్చింది. ఆమె మోకాలికి గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఆక్యుపంక్చర్‌ విధానం ద్వారా ఆమె మోకాలికి చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గాయానికి కారణం ఏమిటి అనేది మాత్రం ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆమె బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరిగి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత పోస్ట్‌ చేసిన ఇదే సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధన సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సమంతకు ఎన్నో సంవత్సరాలుగా మేకప్‌ ఆర్టిస్టుగా ఉన్న సాధన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.  

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా రంగానికి చెందిన కళాకారులందరికీ పెద్ద తలనొప్పిగా మారిన విషయం ట్రోలింగ్‌. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌గా స్పందించినా ఒక్కోసారి అదే వివాదంగా మారే ప్రమాదం ఉంది. అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధనసింగ్‌ విషయంలో కూడా అదే జరిగింది. సెలబ్రిటీల మేకప్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాధన.. ఒక సమయంలో తీవ్ర విమర్శలకు లోనయ్యారు. ‘జాను’ షూటింగ్‌ సమయంలో సమంతకు చేసిన మేకప్‌ గురించి సాధనను రకరకాలుగా విమర్శించారు. అందమైన సమంతను తన మేకప్‌తో అందవికారంగా తయారు చేశారని సోషల్‌ మీడియాలో చాలా మంది కామెంట్‌ చేశారు. సాధనను మేకప్‌ ఆర్టిస్ట్‌గా తొలగించాలని సమంతకు ఎంతో మంది సలహా ఇచ్చారు. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా సమంత మాత్రం పట్టించుకోలేదు. సాధన వర్క్‌ని పూర్తిగా నమ్మారు. తనకు ఆమె ఏ లుక్‌ని క్రియేట్‌ చేసిందో దాన్నే ఫాలో అయ్యారు. అయితే మేకప్‌ విషయంలో తనకు వచ్చిన విమర్శలను చూసి ఎంతో ఆందోళన చెందానని సాధన చెప్పుకొచ్చారు. 

సమంతకు చేసిన మేకప్‌ని చూసి విమర్శించిన వారంతా.. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అదే మేకప్‌పై ప్రశంసలు గుప్పించారని తెలిపారు సాధన. జాను పాత్రకు సరిగ్గా సరిపోయే మేకప్‌ చేశావని అందరూ ఆమెను అభినందించారు. ఈ విషయంలో తనకు సమంత ఎంతో ధైర్యం చెప్పారని, ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే తన వర్క్‌ను పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలిగానని సాధన తెలిపింది. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా తన పని తాను చేసుకు వెళ్ళడం వల్ల మంచే జరిగిందని సాధన ఎంతో ఆనందంగా చెబుతోంది.