English | Telugu

మెహర్‌ రమేష్‌ ఇంట విషాదం.. ఎమోషనల్‌ అయిన పవన్‌కళ్యాణ్‌!

టాలీవుడ్‌ డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. సత్యవతి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తన సంతాపాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సత్యవతి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తను చదువుకునే రోజుల్లో మాచర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న సత్యవతి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లేవాళ్ళమని పవన్‌ పేర్కొన్నారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సత్యవతి ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రకటనలో తెలిపారు. 

మెహర్‌ రమేష్‌ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన మెగా కుటుంబానికి చెందినవాడేనని అందరూ అనుకునేవారు. డైరెక్టర్‌గా ఎదిగిన తర్వాత ఎన్నో వేడుకల్లో మెహర్‌ రమేష్‌తో తమ కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి మెగాస్టార్‌ చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తను డైరెక్టర్‌గా ఎదిగేందుకు మెగాస్టార్‌ పేరును మెహర్‌ ఎక్కడా ఉపయోగించలేదు. కేవలం తన టాలెంట్‌తోనే డైరెక్టర్‌గా ఎదిగారు. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే మెగా కుటుంబంతో ఆయనకు ఉన్న బంధుత్వం గురించి బయటికి వచ్చింది. డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కొన్ని ఫ్లాపుల వల్ల మెహర్‌ వెనకబడిపోయారు. ఆ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి అతనికి దర్శకుడిగా ఓ అవకాశం ఇచ్చారు. అలా మెహర్‌తో కలిసి చేసిన సినిమాయే ‘భోళాశంకర్‌’. అయితే అతనిపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సినిమా పరాజయం పాలైంది.