English | Telugu

‘సాహో’ గురించి మీకు తెలీని విషయం!

 

తెలుగు సినిమా సరైన దారిలో పడిందండోయ్. ఒకప్పుడు మూస ధోరణి సినిమాలొచ్చేవి. ఇప్పుడిప్పుడే మన వాళ్లు కొత్తగా ఆలోచించడం మొదలెట్టారు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి ది కంక్లూజషన్, శతమానం భవతి, ఫిదా, అర్జున్ రెడ్డి, గురు, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి... ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైన సినిమాలు. వరుస చూస్తోంటే.. మళ్లీ స్వర్ణయుగం నాటి రోజులు వచ్చేలా కనిపిస్తోందండోయ్.  ఆల్రెడీ వచ్చేసిన సినిమాల సంగతి అటుంచితే... రాబోతున్న సినిమాలు కూడా సామాన్యమైనవేం కాదు. రీసంట్ గా చిరంజీవి ‘సైరా’ అంటూ కొబ్బరికాయ్ కొట్టేశాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. మామూలుగా ఉండదు. మాసూ క్లాసూ అందరూ సైరా... అనాల్సిందే. అలాంటి సబ్జెక్ట్. రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నమైన కథ. అదొక్కటేనా! మన ప్రభాస్‘సాహో’.. అది కూడా సాధారణమైన సినిమాఏం కాదు.  ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడని చాలామంది చెబుతున్నారు. కొందరు అత్యుత్సాహంతో రాస్తున్నారు కూడా. కానీ... ‘సాహో’రెగ్యులర్ మూవీ కాదు. పిరియాడికల్ ఫిలిం. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులనూ, ప్రస్తుత కాలమాన పరిస్థితులనూ కలగలిపిన కథాంశంతో రూపొందుతోన్న వైరైటీ సినిమా ‘సాహో’. ఇందులో ప్రభాస్ రెండు కోణాల్లో కనిపించనున్నాడట. ఇప్పటివరకూ మనం చూడని కొత్త కోణమేదో ఈ కథలో ఉంటుందని టాక్.

ఇక ‘బాగమతి’... అనుష్క చేస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తికావొచ్చింది. ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం నేటి తరం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచక మానదు.  ఇంకోవైపు...  ణశేఖర్..‘హిరణ్య కశిప’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. భాగవతంలోని నరసింహావతార ఇతివృత్తాన్ని తీసుకొని ఈ సినిమా తీస్తున్నాడు గుణశేఖర్. ఈ సినిమాలో టైటిల్ రోల్  రానా పోషిస్తాడని అప్పట్లో వార్తొచ్చాయ్. ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే... హిరణ్యకశిపునిగా ఇందులో వెంకటేశ్ చేయనున్నాడట. దానికి తగ్గ కసరత్తులు కూడా అప్పుడే ప్రారంభించాడట వెంకీ. ఆయన చేస్తున్న తొలి పౌరాణిక పాత్ర ఇదే కావడం గమనార్హం. ఇంకా రకరకాల కొత్త తరహా కథలు ఫిలిం సర్కిల్స్ లో తయారవుతున్నాయ్. ముందు ముందు సినీ అభిమానులందరికీ పండగే.