English | Telugu

‘కంగువా’ రిలీజ్‌ని అడ్డుకుంటున్న రిలయన్స్‌.. మద్రాస్‌ హైకోర్టు ఏం చేయబోతోంది?

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘కంగువా’. టైమ్‌ ట్రావెల్‌ ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్‌ 14న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని అత్యధిక భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక డిఫరెంట్‌ జోనర్‌లో, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్‌ ప్రకటించినట్టుగా నవంబర్‌ 14న ఈ సినిమా రిలీజ్‌ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అడ్డుకుంటోంది. 

వివరాల్లోకి వెళితే.. ‘కంగువా’ చిత్రం రిలీజ్‌ నిలిపివేయాలని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. స్టూడియో గ్రీన్‌ సంస్థ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని, ఆ డబ్బు ఇచ్చిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాల నిర్మాణం కోసం రిలయన్స్‌ సంస్థ నుంచి రూ.99 కోట్లకు పైగా స్టూడియో గ్రీన్‌ సంస్థ రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటివరకు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. తమకు చెల్లించాల్సిన మిగతా డబ్బు ఇచ్చిన తర్వాతే కంగువా చిత్రాన్ని విడుదల చేసుకోవాలని రిలయన్స్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. అలాగే తంగలాన్‌ చిత్రాన్ని కూడా ఓటీటీలో స్ట్రీమ్‌ చెయ్యకూడదని కోరింది. ఈ కేసు జస్టిస్‌ కుమరేష్‌ బాబు ముందుకు విచారణకు వచ్చింది. తమకు నవంబర్‌ 7 వరకు సమయం కావాలని స్టూడియో గ్రీన్‌ సంస్థ కోర్టును కోరింది. అప్పటివరకు తమ సినిమా రిలీజ్‌ చెయ్యం అని చెప్పింది. అంతేకాదు, తంగలాన్‌ చిత్రాన్ని కూడా అప్పటివరకు ఓటీటీలోకి తీసుకురాబోమని తెలిపింది. ఈ కేసును నవంబర్‌ 7వ తేదీకి వాయిదా వేశారు. రిలయన్స్‌, స్టూడియో గ్రీన్‌ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు పూర్తయితే తప్ప కంగువా రిలీజ్‌ అవ్వదు. మేకర్స్‌ ప్రకటించిన రిలీజ్‌ డేట్‌కి ఇంకా చాలా రోజులు ఉంది. మరి ఈలోపు సమస్య పరిష్కారమైతే సినిమా సజావుగా రిలీజ్‌ అవుతుంది. లేదంటే కంగువాకు కష్టాలు తప్పవు.