Read more!

English | Telugu

రవితేజ, గుణశేఖర్,చౌదరిల నిప్పు

రవితేజ, గుణశేఖర్,చౌదరిల "నిప్పు" సినిమా "మే"28 వ తేదీన ప్రారంభమవుతుంది. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు పతాకంపై గతంలో లాహిరి లాహిరి లాహిరిలో, శీతయ్య, దేవదాసు" వంటి హిట్ చిత్రాలనందించిన దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి ప్రస్తుతం తాను నిర్మాతగా మారి, మాస్ మహరాజా రవితేజ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో "నిప్పు" అనే సినిమాని నిర్మించబోతున్నారు. "నిప్పు" సినిమాని కీర్తిశేషులు యన్ టి ఆర్ జయంతి రోజున అంటే "మే" 28 వ తేదీన ప్రారంభిస్తారు. ఇక్కడో విశేషమేమిటంటే వై.వి.యస్.చౌదరి, రవితేజ, గుణశేఖర్ ముగ్గురూ దాదాపు ఒకే రూములో ఉండేవారు. అంటే సీనియర్ సినీ నర్తకి అనూరాధ వాళ్ళింట్లో పై రూములోవై.వి.యస్.చౌదరి, రవితేజ ఉంటే క్రింద రూములో గుణశేఖర్ ఉండేవారు.

వీళ్ళ ముగ్గురి కలయికలో "నిప్పు" సినిమా రాబోతూంది. గతంలో తేజ స్వీయ దర్శకత్వంలో "జయం"సినిమాని, పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో "ఇడియట్" సినిమాని నిర్మించగా, వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో "దేవదాసు" సినిమాని నిర్మించారు. ఈ మూడు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. ఇకపై నుంచి తన దర్శకత్వంలోనే కాకుండా ప్రతిభ కలిగి, తనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న తన సమకాలీన దర్శకులతోనూ, అలాగే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ కూడా తాను సినిమాలను నిర్మిస్తానని వై.వి.యస్.చౌదరి మీడియాకు తెలియజేశారు. తన సినిమాలకు తన కుమార్తెలూ యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా ఇద్దరు కూడా సహ నిర్మాతలుగా వ్యవరిస్తారనీ, తన సినిమాలకు తన బావమరిది కిశోర్ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరిస్తారనీ,"నిప్పు" సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను "మే"28 న, అంటే సినిమా ప్రారంభం రోజున తెలియజేస్తామనీ వై.వి.యస్.చౌదరి తెలిపారు.

ప్రస్తుతం మెగాస్టార్ మేనల్లుడు సాయి ధర్మతేజను హీరోగా పరిచయం చేస్తూ వై.వి.యస్.చౌదరి "రేయ్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ రోజు అంటే "మే" 23 వై.వి.యస్.చౌదరి జన్మదినం, అంతే కాదు తన తొలి సినీ గురువు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం కూడా ఇదే కావటం విశేషం. ఈ సందర్భంగా తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జునకు వై.వి.యస్.చౌదరి మరోసారి తన కృతజ్ఞతలు తెలిపారు.