Read more!

English | Telugu

'రత్నం' మూవీ రివ్యూ

సినిమా పేరు: రత్నం
తారాగణం: విశాల్, ప్రియ భవాని శంకర్, యోగిబాబు, సముద్రఖని, మురళీశర్మ, రామచంద్రరాజు, గౌతమ్ మీనన్, హరీష్ పేరడీ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీఓపీ: ఎం సుకుమార్
ఎడిటర్: టి.ఎస్. జయ్
రచన, దర్శకత్వం: హరి
నిర్మాత: కార్తికేయన్ సంతానం
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్‌
విడుదల తేదీ: ఏప్రిల్ 26, 2024

'మార్క్ ఆంటోని' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విశాల్ నటించిన మూవీ 'రత్నం'. ఈ సినిమాకి హరి దర్శకుడు. 'భరణి', 'పూజ' వంటి కమర్షియల్ హిట్స్ అందించిన విశాల్-హరి కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో 'రత్నం' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
రత్నం (విశాల్) చిన్నప్పుడే తన ప్రాణాలకు తెగించి పన్నీర్ అనే వ్యక్తి (సముద్రఖని)ని కాపాడతాడు. దీంతో రత్నంని చేరదీసి సొంత అల్లుడిలా భావించి ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు పన్నీర్. కాలక్రమేణా పన్నీర్ ఎమ్మెల్యేగా ఎదిగితే.. రత్నం అతనికి రైట్ హ్యాండ్ గా ఉంటూ.. ఆ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడతాడు. అయితే ఒకసారి రోడ్డుపై మల్లిక(ప్రియ భవాని శంకర్)ను చూసి ఆమెని ఎక్కడో చూసినట్టుందని భావిస్తాడు. అదే సమయంలో ఆమెపై ఎటాక్ జరిగితే కాపాడతాడు. లింగం బ్రదర్స్ (మురళీ శర్మ & కో) మల్లికను చంపాలని చూస్తున్నారని తెలుసుకున్న రత్నం.. ఆమెకి అండగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. అసలు లింగం బ్రదర్స్ ఎవరు? వాళ్ళు మల్లికను ఎందుకు టార్గెట్ చేశారు? మల్లికకు సాయం చేయాలని రత్నం ఎందుకు బలంగా నిర్ణయించుకున్నాడు? చివరికి లింగం బ్రదర్స్ నుంచి మల్లికను కాపాడగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
పక్కా కమర్షియల్ సినిమాలు తీయడంలో దర్శకుడు హరి స్పెషలిస్ట్. 'భరణి', 'సింగం'(యముడు) వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదిరిపోయే ఫైట్లు, డైలాగ్ లు, పాటలతో.. హీరోలను పవర్ ఫుల్ గా చూపించి హిట్ కొట్టడం హరి శైలి. అయితే ఇప్పుడు ఈ తరహా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కాలం చెల్లింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. యాక్షన్ సినిమాల్లోనూ వైవిధ్యం ఆశిస్తున్నారు. హీరో ఎలివేషన్ సీన్లు కూడా మారిపోయాయి. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొందరు మారుతున్నారు కానీ.. దర్శకుడు హరి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడని 'రత్నం' సినిమా చూస్తే అనిపిస్తుంది.

కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. ఒకట్రెండు ట్విస్ట్ లు నమ్ముకొని, వాటితోనే ప్రేక్షకుల మెప్పు పొందవచ్చనే భ్రమల్లో ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా ఉంది. సినిమా నడుస్తున్న కొద్దీ, ప్రేక్షకుల్లో నీరసం పెరిగిపోతూ ఉంటుంది. ఫస్టాఫ్ కొంతవరకు పరవాలేదు కానీ, సెకండాఫ్ మరీ తేలిపోయింది. అలాగే తెలుగు వెర్షన్ మాటలు, పాటల మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. చాలా సంభాషణలు సందర్భానుసారంగా లేనట్టుగా అనిపించాయి. ఇక ఈ సినిమాలో అంతో ఇంతో రిలీఫ్ అంటే దేవి శ్రీ ప్రసాద్ సంగీతమే. ఉన్నంతలో తన సంగీతంతో ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. యాక్షన్ ప్రియులను ఫైట్లు కొంతవరకు ఆకట్టుకునే అవకాశముంది. అయితే, మితిమీరిన హింస ఉన్న కారణంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి దూరంగా ఉండటమే మంచిది. 

నటీనటుల పనితీరు:
రత్నం అనేది విశాల్ కి బాగా అలవాటైన పాత్ర. ఎప్పటిలాగే యాక్షన్ సన్నివేశాల్లో, కామెడీ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ప్రియ భవాని శంకర్ ఉన్నంతలో తన మార్క్ చూపించింది. యోగిబాబు అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సముద్రఖని, మురళీశర్మ, రామచంద్రరాజు, గౌతమ్ మీనన్, హరీష్ పేరడీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా...
'రత్నం' అనేది ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. యాక్షన్ ప్రియులకు కొంతవరకు నచ్చవచ్చు. కొత్తదనం కోరుకునే వారయితే, ఆ వైపు చూడకపోవడమే బెటర్.

రేటింగ్: 2/5