English | Telugu

రామాయణంలో రణబీర్‌ కపూర్‌ డూయల్‌ రోల్‌.. ఒకటి రాముడు, మరో పాత్ర ఏమిటో తెలుసా?

భారతీయ ఇతిహాసాల్లో రామాయణం, మహాభారతం గ్రంథాలకు అత్యంత ప్రాధాన్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రంథాల ఆధారంగా అన్ని భారతీయ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తే రామాయణాన్ని ఎన్ని సార్లు విన్నా, దానిపై ఎన్ని సినిమాలు వచ్చినా విసుగు లేకుండా చూస్తారు ప్రేక్షకులు. అయితే దాన్ని ఎంత జనరంజకంగా చిత్రీకరించారు అనేది సినిమా నిర్మాణంలో ప్రధానాంశంగా నిలుస్తుంది. పాతతరంలో లవకుశ మొదలుకొని నిన్న మొన్నటి ఆదిపురుష్‌ వరకు రకరకాల కోణాల్లో రామాయణాన్ని ఆవిష్కరించారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో సీరియల్‌గా వచ్చిన ‘రామాయణ్‌’ ఎంత పాపులర్‌ అయ్యిందో అప్పటి ప్రేక్షకులకు బాగా తెలుసు. అంటే ఎన్ని మాధ్యమాల్లో, ఎన్నిరకాలుగా తీసినా ఈ ఇతిహాసానికి ఆదరణ తగ్గదు అనేది వాస్తవం. 

అందుకే ఇప్పుడు రామాయణాన్ని మరోసారి జనరంజకంగా తెరకెక్కించేందుకు దర్శకుడు నితిష్‌ తివారి నడుం బిగించారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ వస్తున్నాయి. సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో వున్న ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వలేదు. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌ అప్పుడప్పుడు రిలీజ్‌ అవుతున్నాయి. రామాయణం సినిమాను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. 

దాదాపు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్‌ కానున్న పాన్‌ ఇండియా మూవీ రామాయణం. శ్రీరాముడిగా రణబీర్‌ కపూర్‌, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా యష్‌ నటిస్తున్నారన్న విషయం గతంలోనే లీక్‌ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయి. అందర్నీ ఆశ్చర్యపరిచే మొదటి విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌ రాముడిగానే కాదు, పరశురాముడి పాత్రలో కూడా నటిస్తున్నాడట. పరశురాముడి పాత్ర రామాయణంలోనూ, మహాభారతంలోనూ ఉందనే విషయం తెలిసిందే. ఈ రెండిరటిలో రణబీర్‌ ఏ ఇతిహాసంలో పరశురాముడిగా చేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. మరో విషయం ఏమిటంటే.. రావణునితో తలపడే గరుడ పక్షికి అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఇస్తారని తెలుస్తోంది. 

పూర్తి రామాయణాన్ని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో సీతారాముల జననం, వారి బాల్యం, ఆ తర్వాత వివాహానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘట్టం, సీతను రావణుడు అపహరించడం, ఆ  తర్వాత వనవాసం వంటి అంశాలను పొందుపరుస్తున్నారు. ఇక రెండో భాగంలో రావణాసురుడి చుట్టూనే ఎక్కువ కథ నడుస్తుందట. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్‌, లక్ష్మణుడిగా రవిదుబే కనిపించబోతున్నారు. శూర్పణఖ పాత్రలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. భారీ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అగ్రశ్రేణి నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు. అలాగే ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. రామాయణం మొదటి భాగాన్ని 2026లో విడుదల చేస్తారని సమాచారం.