English | Telugu

అల్లు అర్జున్‌ దారిలోనే రామ్‌చరణ్‌ కూడా వెళ్తున్నాడా.. కొత్తగా ఆలోచించరా?

డిసెంబర్‌ 5న విడుదలైన అల్లు అర్జున్‌, సుకుమార్‌ల ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 1500 కోట్లు కలెక్ట్‌ చేసి కొన్ని పాత రికార్డులను క్రాస్‌ చేసింది. కొత్త రికార్డులను క్రియేట్‌ చేసే దిశగా పుష్ప2 ప్రయాణం సాగుతోంది. ఈమధ్యకాలంలో ‘పుష్ప2’ని అడ్డుకునే భారీ సినిమా ఏదీ లేకపోవడం కూడా పుష్ప2కి కలిసొచ్చింది. సంక్రాంతి సీజన్‌ వరకు మరో సినిమా లేకపోవడంతో పుష్పరాజ్‌ దూకుడుకి అడ్డు లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత అందరి దృష్టీ రామ్‌ చరణ్‌, శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’పైనే ఉంది. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. జనవరి 10న ఈ సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. అందులో భాగంగా శనివారం అమెరికాలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. డల్లాస్‌లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్‌ జరగనుంది. పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా హాజరుకానున్నారు. 

పుష్ప2కి నిర్వహించిన ఈవెంట్ల కారణంగా సినిమాపై భారీ హైప్‌ వచ్చింది. ‘గేమ్‌ఛేంజర్‌’ కూడా దాన్నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగే రోజు రామ్‌చరణ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీతో వెన్యూకి చేరుకుంటారని చెబుతున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత టికెట్‌ సేల్స్‌ మరింత పెరుగుతాయంటున్నారు. ఇప్పటికే సేల్స్‌ లక్ష దాటింది. ఈవెంట్‌ జరిగే నాటికి అది మిలియన్‌ వరకు చేరవచ్చు. పుష్ప పార్ట్‌ 1 పెద్ద హిట్‌ కావడం, అల్లు అర్జున్‌కి నేషనల్‌ అవార్డు రావడం వంటివి సెకండ్‌ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడడానికి కారణాలుగా చెప్పొచ్చు. కానీ, గేమ్‌ ఛేంజర్‌ అలా కాదు. ఎప్పుడో స్టార్ట్‌ అయిన ఈ సినిమా మూడేళ్లపాటు చిత్రీకరణ జరుపుకోవడం, మధ్యలో శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు2 డిజాస్టర్‌ కావడం వంటివి గేమ్‌ ఛేంజర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. 

దీన్ని అధిగమించే దిశగా దిల్‌రాజు ప్రణాళికలు రచిస్తున్నాడు. సినిమా రిలీజ్‌కి కేవలం 20 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. దీంతో సినిమాకి పుష్ప2 తరహాలో భారీ హైప్‌ తేవడానికి అనుసరించాల్సిన అన్ని పద్ధతుల్ని పరిశీలిస్తున్నారు. ఆ ప్రకారమే నార్త్‌ ఇండియాలో భారీ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఈ ఈవెంట్స్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తం ప్రమోషన్స్‌కి రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు పుష్ప2 మేనియాలో ఉన్న ప్రేక్షకుల్ని గేమ్‌ ఛేంజర్‌వైపు తిప్పేందుకు ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో వెళ్లాలని యూనిట్‌ ఆలోచన. అందుకే ప్రమోషన్స్‌లో పుష్ప2ని ఫాలో అవుతున్నారు. మరి ఇది గేమ్‌ ఛేంజర్‌కి ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది అనేది తెలియాలంటే మరో 20 రోజులు ఆగక తప్పదు.