English | Telugu
ఐటీ చట్టంతో రామ్ గోపాల్ వర్మ అవుట్
Updated : Nov 11, 2024
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)హీరోగా వచ్చిన 'శివ'(siva)సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే. ఈ మూవీ ద్వారా దర్శకుడు గా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ, మొదటి సినిమాతోనే భారతీయ చిత్ర పరిశ్రమ తన వైపు చూసేలా చేసుకున్నాడు.ఆ తర్వాత క్షణక్షణం, గోవిందా గోవిందా, అంతం,అనగనగా ఒక రోజు, రంగీలా,సత్య, రాత్రి, గాయం,సర్కార్, కిల్లర్ వీరప్పన్ వంటి పలు తెలుగు, హిందీ చిత్రాలతో విభిన్న దర్శకుడుగా ఎంతో కీర్తి గడించాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు వర్మ తన దర్శకత్వంలో 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కించాడు.ఆ సినిమా రిలీజ్ కి ముందు అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు,లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలని కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా వర్మ ఒక పోస్టు చెయ్యడం జరిగింది. దీంతో ఇప్పుడు వర్మపై ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.దర్యాప్తు స్వీకరించిన పోలీసులు కేసుపై దర్యాప్తు వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో వర్మ అరెస్ట్ అవుతాడనే ప్రచారం కూడా జరుగుతుంది.మరి ఈ కేసు పై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
వ్యూహం(vyuham)సినిమా 2024 మార్చి రెండున విడుదల అవ్వగా రంగం ఫేమ్ అజ్మల్, మానస రాధాకృష్ణన్, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో చేసారు.రామదూత క్రియేషన్స్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు.సత్యాలని అసత్యాలుగా, అసత్యాలని సత్యాలుగా చూపించిన ఈ చిత్రం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కి అనుకూలంగా నిర్మించడం జరిగింది.