Read more!

English | Telugu

బాబూ చరణ్‌.. ఈ విషయంలో నిన్ను గైడ్‌ చేసిందెవరో చెబుతావా?

 

ఒక సినిమా జనంలోకి వెళ్లాలంటే పబ్లిసిటీ ఎంతో అవసరం. స్టార్‌ కాస్ట్‌ ఎంత వున్నా, ఎంత భారీ సినిమా అయినా దాన్ని సరైన పద్ధతిలో ప్రమోట్‌ చేసినపుడే దానిపై ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ అనేవి ఏర్పడతాయి. అలా కాకుండా సైలెంట్‌గా సినిమాను మొదలు పెట్టేస్తే దాని వల్ల ఆ ప్రాజెక్ట్‌కి ఉపయోగం ఏమీ ఉండదు. ఇటీవలి కాలంలో మీడియా అనేది బాగా విస్తరించింది. ఒక సినిమాకి సంబంధించి ఏ చిన్న ఈవెంట్‌ చేసినా క్షణాల్లో జనానికి చేరిపోతోంది. దాని వల్ల ఆ మేకర్స్‌కి లాభమే తప్ప నష్టం ఉండదు. అలాంటిది ఒక భారీ సినిమాను ప్రారంభిస్తూ దానికి మీడియాను కూడా ఆహ్వానించకుండా, ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో ఈవెంట్‌ను పూర్తి చేసిన వైనం ఇటీవల జరిగింది. 

టాలీవుడ్‌ టాప్‌ హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకొని గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌తో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్న రామ్‌చరణ్‌ ఆ సినిమా చివరిదశలో ఉండడంతో తన 16వ సినిమాను స్టార్ట్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను మార్చి 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలిండియా స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించడం, ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ వంటి నిర్మాణ సంస్థలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇంతటి భారీ సినిమాను చడీ చప్పుడు లేకుండా స్టార్ట్‌ చేసేశారు. 

గతంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రారంభమైన ‘దేవర’ చిత్రానికి కూడా ఇదే పద్ధతిని పాటించారు. మీడియాను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోయినా, కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఔట్‌ లింక్‌ను మీడియాకు ప్రొవైడ్‌ చేశారు. దానివల్ల ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీడియా దాన్ని ల్కెవ్‌ టెలికాస్ట్‌ చేసింది. కానీ, చరణ్‌ సినిమా ఓపెనింగ్‌కి మాత్రం అలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం విడ్డూరంగా అనిపించింది. పైగా ఈ ప్రారంభోత్సవానికి ఎ.ఆర్‌.రెహమాన్‌, జాన్వీ కపూర్‌ వచ్చారు. అంతేకాదు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఇలాంటి గ్రేట్‌ ఈవెంట్‌ విశేషాలు బయటికి తెలియకూడదన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలీదు. ఈ విషయంలో చరణ్‌ని గైడ్‌ చేసినవారెవరో కూడా తెలియ రాలేదు. ఇది పాన్‌ ఇండియా మూవీ అయినప్పటికీ మీడియాను ఈ ఈవెంట్‌కి దూరంగా ఉంచడం వల్ల సినిమాకి రావాల్సినంత రీచ్‌ రాలేదన్నది అందరి అభిప్రాయం. ఇలా చేయడం వల్ల మేకర్స్‌కి కొత్తగా ఒరిగేదేముందో.. పాపం.. వారికే తెలియాలి.