Read more!

English | Telugu

మరీ ఇంత దారుణమా?.. డైరెక్టర్ మీద గుర్రుగా వున్న రామ్ చరణ్ ఫ్యాన్స్!

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్ (Ram Charan). దీంతో ఆయన తదుపరి సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఇప్పట్లో ఫలించేలా లేవు.

'గేమ్ ఛేంజర్'ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఆ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే చరణ్ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించడంతో.. మా హీరో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడని అప్పుడు ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. అయితే ఆ తర్వాత, కొంతకాలానికి దర్శకుడు శంకర్ 'ఇండియన్-2' (Indian 2) తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో అసలు ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు 'ఇండియన్-2' షూటింగ్ పూర్తి కావడం, 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మళ్ళీ మొదలై, శరవేగంగా జరుగుతుండటంతో.. చరణ్ ఫ్యాన్స్ లో మళ్ళీ మునుపటి ఆనందం కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ఆనందం కూడా నిలవలేదు. తాజాగా చరణ్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది.

'ఇండియన్-2' జూన్ 13న విడుదల కానుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం, కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) జూన్ 27న విడుదలవుతుండటం.. వంటి కారణాలతో 'ఇండియన్-2' జూలై 18కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ తేదీకి రావడం కూడా అనుమానమే అనేవాళ్ళు లేకపోలేదు. అయితే 'ఇండియన్-2' ఆలస్యమయ్యే కొద్దీ ఆ ప్రభావం 'గేమ్ ఛేంజర్'పై పడుతుంది. 'ఇండియన్-2' పూర్తి అయితేనే కానీ.. శంకర్ తన ఫుల్ ఫోకస్ ని 'గేమ్ ఛేంజర్'పై పెట్టలేదు. 'ఇండియన్-2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు, ప్రమోషన్స్ కోసం శంకర్ సమయం కేటాయించాల్సింది ఉంటుంది. దాని వల్ల 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడుతుంది. అదే జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలవుతుంది అనుకుంటున్న ఈ చిత్రం.. మరింత ఆలస్యమవుతుంది. అసలు ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు రాకపోయినా ఆశ్చర్యంలేదు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు దాటిపోయింది. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సరిగా లేవు. కనీసం సినిమా నుంచి గ్లింప్స్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. 'ఇండియన్-2' కారణంగా ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కాగా, ఇప్పుడు విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. 'ఇండియన్-2' పూర్తయ్యాక 'గేమ్ ఛేంజర్' అనౌన్స్ చేసినా బాగుండేదని.. లేదా 'గేమ్ ఛేంజర్' కంప్లీట్ అయ్యాక, 'ఇండియన్-2'పై శంకర్ దృష్టి పెడితే బాగుండేదని మండి పడుతున్నారు. మొత్తానికి  'గేమ్ ఛేంజర్' చిత్రం చరణ్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతోంది.