English | Telugu

ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్‌ని రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ అడ్డుకోబోతున్నాడా?

ఒక సినిమాలోని సన్నివేశాలను మరో సినిమాలో వాడుకోవడం అనేది కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. అయితే హాలీవుడ్‌, కొరియన్‌ సినిమాలకు సంబంధించి ఎక్కువగా కాపీ జరుగుతూ ఉంటాయి. ఎలాంటి హక్కులు తీసుకోకుండా ప్రీమేక్‌గా కొన్ని సినిమాలు మన ముందుకు వచ్చాయి. అయితే ఒక నవలలోని సన్నివేశాలను కూడా కాపీ చేస్తున్నారన్న విషయాన్ని తమిళ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తాజాగా పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది. శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. 

ఇదిలా ఉంటే.. తమిళ్‌లో వచ్చిన ‘నవయుగ నాయగన్‌ వేల్‌పారీ’ నవల హక్కులను శంకర్‌ కొనుగోలు చేశారు. దాని ఆధారంగా మూడు భాగాల్లో ఓ సినిమా చేయబోతున్నట్టు భారతీయుడు 2 ప్రమోషన్స్‌లో ప్రకటించారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ఒక సినిమా ట్రైలర్‌లో తను హక్కులు తీసుకున్న నవలలోని కొన్ని కీలక సన్నివేశాలని కాపీ చేశారని శంకర్‌ ఆరోపిస్తున్నారు. కాపీ రైట్‌ చట్టాన్ని ఉల్లంఘించి తన అనుమతి తీసుకోకుండానే తమ సినిమాలో ఆ సన్నివేశాలను చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. సినిమాల్లోగానీ, వెబ్‌ సిరీస్‌లలోగానీ ఆ సన్నివేశాలను వాడుకోవడం మానుకోవాలని ఈ సందర్భంగా శంకర్‌ హెచ్చరించారు.  

ఏ సినిమా ట్రైలర్‌లో ఆ నవల సన్నివేశాలు కనిపించాయనే విషయాన్ని క్లారిటీగా శంకర్‌ చెప్పలేదు. అతని పోస్ట్‌ని చూసి సోషల్‌ మీడియాలో చర్చ మొదలుపెట్టేశారు. ఈ చర్చలో ఎన్టీఆర్‌, కొరటాల శివల ‘దేవర’ గురించే ఎక్కువగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకవేళ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కంగువ’ విషయంలో శంకర్‌ ఈ రకమైన కామెంట్స్‌ చేశారా అనేది కూడా చర్చలోకి వస్తోంది. అయితే ‘కంగువ’ ట్రైలర్‌ రిలీజ్‌ అయి చాలా కాలమైంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన పెద్ద సినిమా ట్రైలర్‌ ‘దేవర’కి సంబంధిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘నవయుగ నాయగన్‌ వేల్‌ పారీ’ నవల హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఫిక్షనల్‌ కథ. దీనిలో గిరిజన రాజులకు చెందిన కథాంశం ఉంటుంది. 

‘దేవర’ చిత్రంలో కూడా అలాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ రెండు సినిమాల్లో దేన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ ఆ పోస్ట్‌ పెట్టాడు అనేది స్పష్టం కాలేదు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా శంకర్‌ సిద్ధపడ్డారు.  ఇదే నిజమైతే ఇప్పుడు ‘దేవర’ రిలీజ్‌కి కష్టాలు తప్పవనే కామెంట్‌ కూడా వినిపిస్తోంది. ‘దేవర’, ‘కంగువ’ ఈ రెండు సినిమాల్లో దేనిపై శంకర్‌ చర్యలు తీసుకుంటాడు అనే దానిపైనే వాటి రిలీజ్‌ కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. డిసెంబర్‌ 20 తర్వాత ‘నవయుగ నాయగన్‌ వేల్‌ పారీ’ నవలను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెడతారని సమాచారం.