Read more!

English | Telugu

ఇక్కడ రజినీకాంత్‌ ఔట్‌.. అక్కడ ఎన్టీఆర్‌ ఔట్‌.. టెన్షన్‌లో ఫ్యాన్స్‌!

పండగ సీజన్‌ వస్తోందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. గత సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య ఏర్పడిన పోటీ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీతోపాటు సాధారణ ప్రేక్షకులు, అభిమానులు కూడా ఈ విషయంలో టెన్షన్‌ పడ్డారు. ఒకేవారంలో స్టార్‌ హీరోల సినిమాలన్నీ రిలీజ్‌ అవ్వడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువని గతంలో చాలాసార్లు ప్రూవ్‌ అయింది. దాన్ని అధిగమించడానికే దర్శకనిర్మాతలు సినిమాల మధ్య క్లాష్‌ అనేది రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల రిలీజ్‌ దగ్గరకి వచ్చేసరికి అందరికీ టెన్షన్స్‌ తప్పడం లేదు. ముఖ్యంగా స్టార్‌ హీరోల అభిమానులు ఈ విషయంలో ఎక్కువ టెన్షన్‌ పడుతుంటారు. తమ అభిమాన హీరో నటించే సినిమాకి నష్టం వాటిల్లుతుందేమోనని బాధ పడిపోతుంటారు. మునుపెన్నడూ లేని విధంగా గత సంక్రాంతి సీజన్‌లో క్లాష్‌ల వల్ల నిర్మాతలు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 

రాబోయే దసరా సీజన్‌లో మరోసారి స్టార్‌ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందరూ ఒకే డేట్‌లో లేదా ఓకే వారంలో థియేటర్లలోకి వచ్చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కనీసం నాలుగైదు సినిమాలు ఇలా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ఈసారి తెలుగు సినిమాలే కాకుండా తమిళ్‌ మూవీస్‌ కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’ను అక్టోబర్‌ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్‌ అవ్వాలి. కానీ, ఆ డేట్‌కి రిలీజ్‌ చెయ్యడం సాధ్యం కాకపోవడంతో అక్టోబర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నెలలో ‘దేవర’ తప్ప మరో టాప్‌ హీరో సినిమా రిలీజ్‌ లేనప్పటికీ, ఆ టైమ్‌కి మరికొన్ని సినిమాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ చిత్రం మాత్రం ‘దేవర’తో క్లాష్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే రజినీకాంత్‌ సినిమా విడుదల తేదీ గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే కాస్త అటూ ఇటూగా దేవర రిలీజ్‌ టైమ్‌లోనే వేట్టయాన్‌ రిలీజ్‌ కాబోతోందని సమాచారం. అదే జరిగితే తప్పకుండా రెండు సినిమాల మధ్య క్లాష్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన రజినీకాంత్‌ సినిమా ‘లాల్‌ సలామ్‌’ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో రజినీ సినిమా అంటే అంత క్రేజ్‌ ఉండకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. 

‘దేవర’ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. దీనికి సీక్వెల్‌ కూడా ఉందని గతంలోనే ప్రకటించారు. దీంతో సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వరకు రజినీ సినిమాతో ఎన్టీఆర్‌కు ఇబ్బంది లేకపోయినా ఇతర భాషల్లో కూడా దేవర రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో తమిళ్‌లో భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రజినీ సినిమాకి, తమిళనాడు రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. ఈ విషయంలో యంగ్‌ టైగర్‌ అభిమానులు, సూపర్‌స్టార్‌ అభిమానులు తెగ టెన్షన్‌ పడిపోతున్నారట. పండగ సీజన్‌లో రిలీజ్‌ అవుతున్న సినిమాలుగా ప్రస్తుతం ‘దేవర’, ‘వేట్టయాన్‌’ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇద్దరూ సేఫ్‌గా బయటపడే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.