English | Telugu
బాలయ్య దర్శకుడితో రజినీకాంత్!
Updated : Nov 19, 2023
భాషతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయడానికి దర్శకులందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల 'జైలర్'తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్.. త్వరలో తాను కీలక పాత్ర పోషించిన 'లాల్ సలామ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తన 170వ సినిమాని టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో, 171వ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. అయితే వీటి తర్వాత రజినీ టాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు.
'పవర్', 'జై లవ కుశ', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బాబీ కొల్లి. ప్రస్తుతం ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత బాబీ.. సూపర్ స్టార్ తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత కోన వెంకట్ కన్ఫర్మ్ చేశాడు.
"రజినీకాంత్ గారితో సినిమా చేయబోతున్నారని తెలిసింది" అనే ప్రశ్నకు కోన వెంకట్ బదులిస్తూ "బాబీ నెక్స్ట్ ఫిల్మ్ అది. మేము కలిసి చేయబోతున్నాం. జైలర్ విడుదల కాకముందే కథ చెప్పడం జరిగింది. రజినీ గారికి కథ బాగా నచ్చింది, బాబీ అంటే ఆయనకు మంచి ఇంప్రెషన్ ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు." అని చెప్పుకొచ్చాడు.
'NBK 109'తో బిగ్ స్క్రీన్ మీద నెత్తుటి స్నానం చేయించనున్న బాబీ.. రజినీకాంత్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.