English | Telugu
రాజమౌళి వర్సెస్ అల్లు అర్జున్.. ఇది అసలైన పాన్ ఇండియా వార్!
Updated : Nov 18, 2024
పాన్ ఇండియా కలలు అందరూ కంటున్నారు. కానీ ఆ కలను నిజం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా చేసి, వివిధ భాషల్లో విడుదల చేస్తే సరిపోదు. అందుకు తగ్గ భారీ ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు రాజమౌళి (Rajamouli) అందరికంటే ముందు ఉంటారు. ఆయన మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. సినిమాని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయితే హీరోలలో మాత్రం ఆ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేసుకునే వారు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసే దిశగా అల్లు అర్జున్ (Allu Arjun) అడుగులు పడుతున్నాయి.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'పుష్ప-2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో స్టార్ట్ చేసింది మూవీ టీం. నవంబర్ 17న పాట్నాలో 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు, దాదాపు రెండు లక్షల మంది అభిమానులు హాజరయ్యారని అంచనా. నార్త్ స్టేట్ లో, అందునా ఏకంగా రెండు లక్షల మంది సమక్షంలో.. సక్సెస్ ఫుల్ గా గ్రాండ్ ఈవెంట్ జరపడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో 'పుష్ప-2' టీం నూటికి నూరు శాతం విజయం సాధించింది. అంతేకాదు పాట్నాలో జరిగిన ఈవెంట్ సౌండ్, దేశవ్యాప్తంగా మోతమోగిపోయింది. ఎంతలా అంటే రాజమౌళి సైతం ఈ ఈవెంట్ సక్సెస్ కి ఫిదా అయిపోయారు. (Pushpa 2 Trailer)
పాట్నాలో జరిగిన 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ పై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న భారీ పేలుడు సంభవించనుంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నాను పుష్ప." అంటూ రాజమౌళి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్ తో.. నార్త్ లో చేసిన 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థమవుతుంది. అల్లు అర్జున్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇదే టెంపోని కొనసాగిస్తే.. భవిష్యత్ లో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి వర్సెస్ అల్లు అర్జున్ అనే పేరు పడినా ఆశ్చర్యంలేదు.