English | Telugu
బాలయ్యతో దిల్‌రాజు ఢీ... పక్కా ప్లాన్‌తో డబుల్ ధమాకా!
Updated : Nov 21, 2024
ప్రతి ఏడాది మొదట వచ్చే తెలుగు వారి పండగ సంక్రాంతి. ఈ పర్వదినాన్ని సినిమా పండగగా కూడా జరుపుకోవడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. టాప్ హీరోలందరూ తమ సినిమాల రిలీజ్ జనవరి నెలకు కాస్త అటూ ఇటూగా ఉంటే సంక్రాంతికే రావాలని చూస్తుంటారు. దానికి తగ్గట్టుగా దర్శకనిర్మాతలపై ఒత్తిడి తెస్తుంటారు. అలా ఒక ప్లానింగ్ ప్రకారం తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. పండగకు ఏయే సినిమాలు సందడి చేయబోతున్నాయి అనే దానిపై ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా గందరగోళం జరిగింది. మూడు రోజుల తేడాతో నాలుగు సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఇవికాక ఈగల్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలను కూడా సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలనుకున్నారు. చివరికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రంగంలోకి దిగి సంక్రాంతికి ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాలను వెనక్కి పంపింది.
ఇక ఈ నాలుగు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా హనుమాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి స్టార్ హీరోలకు చుక్కలు చూపించింది. గుంటూరు కారం, నా సామిరంగా చిత్రాలు సూపర్‌హిట్ కాగా, సైంధవ్ మాత్రం ఫ్లాప్ అయింది. 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో గత కొన్ని నెలలుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి రామ్‌చరణ్ న్యూ మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో లేదు. మొదట డిసెంబర్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, అది సంక్రాంతికి ఫిక్స్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే ఒక్కసారిగా ఆ సినిమా రంగంలోకి దిగింది. ఇటీవల టీజర్ రిలీజ్‌తో నేనున్నానంటూ బాలయ్య దూసుకొచ్చారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. మరో పక్క పండగ టైటిల్‌తోనే వస్తున్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. వాస్తవానికి ఈ సినిమాని మొదట సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ దిల్‌రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని మరో డేట్‌లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, ఆ సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల యాక్షన్ అండ్ మాస్ సినిమాలు రిలీజ్ అవ్వడం సహజమే. వాటి మధ్యలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి కూడా చక్కని స్పేస్ ఉంటుంది. ఈ విషయాన్ని శతమానం భవతి, సోగ్గాడే చిన్ని నాయనా, నా సామిరంగా చిత్రాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌తోనే దిల్‌రాజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని బరిలోకి దింపుతున్నారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకూ దిల్‌రాజే నిర్మాత కావడం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా ఒకే నిర్మాత నిర్మించిన రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ చిత్రంతో దిల్‌రాజు తలపడుతున్నాడు. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్‌పై సహజంగానే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే.. గతంలో శంకర్ రూపొందించిన సినిమాలు క్రియేట్ చసిన సెన్సేషన్ అలాంటిది. అదీగాక శంకర్ ఫస్ట్‌టైమ్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే. శంకర్ కాన్సెప్ట్‌గానీ, టేకింగ్‌గానీ స్టైలిష్‌గా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పక్లరేదు. అలాంటి డైరెక్టర్ రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడంటే ఎక్స్‌పెక్టేషన్స్ హై రేంజ్‌లో ఉండడం సహజం.
మరోపక్క.. వరస విజయాలతో దూసుకెళ్తూ యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్‌గా సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. గతంలో సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో తెలిసిందే. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు నందమూరి అభిమానులు. ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఎలాంటి హంగామా, హడావిడి లేని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అది. సంక్రాంతి సీజన్‌లో ఇలాంటి సినిమాలకు తప్పకుండా ఆదరణ ఉంటుంది. ఈ ఏడాది వెంకటేష్‌కి నిరాశ ఎదురైనా.. వచ్చే సంక్రాంతికి డెఫినెట్‌గా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఓ పక్క యాక్షన్ ఎంటర్‌టైనర్, మరోపక్క పూర్తి ఫ్యామిలీ చిత్రంతో వస్తున్న దిల్‌రాజు.. నందమూరి బాలకృష్ణతో ఢీ కొడుతున్నాడు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. డాకు మహారాజ్ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాలు సూపర్‌హిట్ అయితే దిల్‌రాజు ఖాతాలో అదో రికార్డు అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.