English | Telugu

ఇండస్ట్రీలో మరో రచ్చ.. రెండో పెళ్లికి రెడీ అయిన నటుడు.. అడిగితే కత్తితో దాడి!

ప్రేమ పేరుతో మోసం, భార్య ఉన్నా మరొకరితో వివాహేతర సంబంధం, పెళ్ళి చేసుకుంటానని యువతిని మోసం చేసిన యువకుడు, పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిపై ప్రియుడు దాడి.. ఇలాంటి హెడ్‌లైన్స్‌తో కూడిన వార్తలు మనం తరచూ పేపర్లలో, న్యూస్‌ ఛానల్స్‌లో చూస్తుంటాం. అయితే ఇవన్నీ సాధారణ ప్రజలకు సంబంధించినవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సొసైటీలో ఎలా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ తరహా వార్తలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇండస్ట్రీ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందో ఈ వార్తలను బట్టి అందరికీ అర్థమవుతోంది. 

ప్రేయసి కోసం అభిమానిని సైతం చంపడానికి వెనుకాడని హీరో దర్శన్‌ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కుటుంబం నుంచి వచ్చిన యువరాజ్‌కుమార్‌, అతని భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాల ఆరోపణలు చేసుకున్నారు. ఆ గొడవ వీధికెక్కి ఇప్పుడు ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది కన్నడ పరిశ్రమలోని వ్యవహారం. టాలీవుడ్‌ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని ప్రూవ్‌ చేస్తున్నారు రాజ్‌ తరుణ్‌, లావణ్య. వీరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. 

ఇలాంటి వ్యవహారాల్లో కన్నడ చిత్ర పరిశ్రమ నెంబర్‌ వన్‌గా ఉంది. తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఓ సీరియల్‌ నటుడు ప్రేమ, పెళ్లి వివాదంలో చిక్కుకున్నాడు. కన్నడలో ఎంతో పాపులర్‌ సీరియల్‌గా పేరు తెచ్చుకున్న ‘నేత్రావతి’లో నటించిన సన్నీ మహిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని భార్య.  సన్నీ చేస్తున్న సీరియల్‌ పూర్తి కావడంతో ఓ ప్రైవేట్‌ కంపెనీలో చేరాడు. ఈ ఏడాది ప్రారంభంలో సన్నికి ఓ యువతి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి వశపరుచుకున్నాడు. కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత గత నెల 15న ఓ గుడిలో పెళ్ళి చేసుకున్నారు. ఆమె గర్భవతి అయింది. ఈ విషయం తెలియగానే సన్ని మొహం చాటెయ్యడం మొదలెట్టాడు. ఓరోజు తమ ఊరికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. అతనికి ఫోన్‌ చేసి విషయం ఏమిటి అని అడిగింది. ఇకపై మనిద్దరం స్నేహితులుగానే ఉందామని సన్ని చెప్పడంతో ఆమె షాక్‌ అయింది. 

అంతేకాదు, సన్నీకి మరో యువతితో నిశ్చితార్థం కూడా జరిగిందని తెలుసుకొని జూలై 22న అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సన్నీ ఆమెపై చేయి చేసుకోవడమే కాకుండా కత్తితో దాడి చేసి పొడిచాడట. గొడవ అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు సన్నీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.