English | Telugu
పవర్‌స్టార్ ధాటికి తట్టుకోలేకపోయిన సూపర్‌స్టార్!
Updated : Sep 4, 2024
టాలీవుడ్‌లో ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సూపర్‌హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చెయ్యడం ద్వారా అప్పటి ఆనందాన్ని మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అభిమానులు. ఈమధ్యకాలంలో రీరిలీజ్ అయిన చాలా సినిమాలు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలన్నీ డిజిటల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఆయా సినిమాలను చూసి ఉంటారు. అయినా థియేటర్‌లో చూసిన అనుభూతి వేరు కాబట్టి దాన్ని ఫీల్ అయ్యేందుకు థియేటర్లకు తరలి వస్తున్నారు ప్రేక్షకులు.
ఆగస్ట్ 9 సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 2001లో విడుదలైన ‘మురారి’ చిత్రాన్ని 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మహేష్‌కి అదే తొలి బ్లాక్‌బస్టర్ హిట్. ఆ చిత్రానికి అప్పట్లో లభించిన ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. చక్కని కుటుంబ కథా చిత్రంగా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మురారి మరోసారి థియేటర్లలోకి వచ్చేసరికి ప్రేక్షకులు, సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. సినిమా రిలీజ్ అయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, సినిమాల ట్రెండ్ మారినా, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చినా ‘మురారి’ చిత్రానికి మరోసారి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రీ రిలీజ్‌ను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా విభిన్నమైన యాడ్‌ను ఇచ్చారు. వివాహ ఆహ్వాన పత్రికలా ఈ సినిమా యాడ్‌ను ఇవ్వడం విశేషం. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల దగ్గర మామూలు హంగామా జరగలేదు. థియేటర్లలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా రెచ్చిపోయి డాన్సులు వేశారు. ఇక కొన్ని జంటలు థియేటర్‌లోనే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇంత హడావిడి మధ్య రిలీజ్ అయిన మురారి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. రూ.5.5కోట్లు వసూలు చేసి అంతకుముందు మహేష్ రీరిలీజ్ రికార్డులను అధిగమించింది. ఇది ఎవ్వరూ బీట్ చెయ్యలేని రికార్డుగా అందరూ భావించారు.
అయితే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు వచ్చేశాడు. సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. అప్పటికే రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా వరుణదేవుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ పరిస్థితిలో గబ్బర్‌సింగ్ పరిస్థితి ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ, పవర్‌స్టార్‌కి జనంలో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది గబ్బర్‌సింగ్ మరోసారి ప్రూవ్ చేసింది. వర్షాలను కూడా లెక్క చేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చి మరోసారి ఈ సినిమాకి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించారు. ఇప్పటివరకు ఏ సినిమాకీ రీరిలీజ్‌లో రాని విధంగా రూ.8.5 కోట్లు వసూలు చేసింది. దీంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
‘గబ్బర్ సింగ్’ సినిమా.. యూనిట్‌లోని చాలా మందికి ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. అప్పటివరకు కొన్ని ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పవన్‌కళ్యాణ్‌కి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది గబ్బర్‌సింగ్. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కెరీర్‌లో కూడా ఇదే బ్లాక్ బస్టర్. ఇక హీరోయిన్ శృతి హాసన్ విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో ఆమెకు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచి శృతిహాసన్‌ని స్టార్‌డమ్ వైపు నడిపించింది. ఈ యూనిట్‌లో అందరి కంటే ముఖ్యమైన వ్యక్తి బండ్ల గణేష్. పవన్‌కళ్యాణ్‌ని దేవుడిగా భావించే గణేష్‌కి గబ్బర్‌సింగ్‌తో ఓ అద్భుతమైన వరం లభించినట్టయింది. అతని కెరీర్‌లో కూడా ఇదే బ్లాక్‌బస్టర్ మూవీ కావడం విశేషం.