English | Telugu
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌కు 'వన్ పీస్' రెడీ!
Updated : Jul 22, 2023
శేఖర్ కమ్ముల బ్లాక్‌బస్టర్ మూవీ 'ఫిదా'లో హీరోయిన్ సాయిపల్లవి పాపులర్ డైలాగ్ "భానుమతి.. వన్ పీస్" గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత 'వన్ పీస్' అనే మాట బాగా పాపులర్ అయ్యింది. ఆ పేరుతో అదివరకే జపాన్‌లో ఒక కామిక్ సిరీస్ (మాంగా సిరీస్) బాగా పాపులర్. దాన్ని ఎయ్‌చిరో ఒదా రాశాడు. ఇప్పుడు ఆ మాంగా సిరీస్ లైవ్ యాక్షన్ సిరీస్ రూపంలో మన ముందుకు రాబోతోంది.
మంకీ డీ. లుఫ్ఫీ అనే యువకుడికి సముద్ర దొంగలకి కింగ్ కావాలే కోరిక ఉంటుంది. సముద్రాల మీద పయనిస్తూ నిధుల్ని వేటాడాలనే లక్ష్యంతో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, ఒక ఓడను సంపాదిస్తాడు. ఆ ఓడలో ప్రయాణిస్తూ ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల్నీ, మరోవైపు భయంకరమైన శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ షోలోని ప్రధానాంశం. లుఫ్ఫీ క్యారెక్టర్‌ను మెక్సికన్ యాక్టర్ ఇనాకి గోదోయ్ పోషించాడు. 8 ఎపిసోడ్ల 'వన్ పీస్' సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 31న స్ట్రీమింగ్ కానున్నది.
ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఉత్తేజభరితంగా సాగి ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిన ఈ సిరీస్‌లో లుఫ్ఫీ బృందం చేసే సాహస కృత్యాలు, భయంకరమైన సముద్ర దొంగలతో అతను చేసే పోరాటాలు ఉత్కంఠభరితంగా అనిపించాయి. మకెన్యు, ఎమిలీ రూడ్, జాకబ్ రొమెరో గిబ్సన్, తాజ్ స్కైలర్ ఇతర ప్రధాన పాత్రలు చేసిన ఈ షోను మాట్ ఓవెన్స్, స్టీవెన్ మేడా క్రియేట్ చేశారు.
ఒదా రాసిన ఈ మాంగా సిరీస్ మొదట 1997లో తొలిసారి పబ్లిష్ అయ్యి, ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పటికే అది జపాన్‌లో యానిమేషన్ సిరీస్‌గా, వీడియో గేమ్స్‌గా, ఫీచర్ ఫిలిమ్స్‌గా తయారయ్యింది.