English | Telugu
100 అడుగుల ఎన్.టి.రామారావు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ అనుమతి!
Updated : Dec 20, 2024
నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదనరాజు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తదితరులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించి హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించారు. దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలియజేశారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తున్నారు. ఆయనకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున ధన్యవాదాలను తెలియచేస్తున్నాము అన్నారు.