Read more!

English | Telugu

చాలా కాలం తర్వాత ఆ రెస్పాన్స్ చూశాను - నందినీ రెడ్డి

అలా మొదలైందితో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నందినీ రెడ్డి మూడో ప్రయత్నంగా వస్తోంది కళ్యాణవైభోగమే. రెండో సినిమా జబర్దస్త్ కాస్త నిరాశపరిచినా, రెట్టించిన ఉత్సాహంతో మూడో సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దానని చెబుతున్నారు నందిని. ఇంకా అనేక ముచ్చట్లు తెలుగువన్ తో ఆమె పంచుకున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరే చూడండి..

 

జబర్దస్త్ చూసిన ఒక నిర్మాత నాకు పాతికలక్షలు అడ్వాన్స్ పంపించాడు. తర్వాతి సినిమా చేద్దామని అడిగాడు. కానీ సినిమా రిలీజైన తర్వాతే ఏదైనా అన్నాను నేను. అది కూడా ఒకందుకు మంచిదే అయింది. జబర్దస్త్ తర్వాత నేను ఎలాంటి సినిమాలు తీయాలో అన్నది ఒక ఐడియా వచ్చింది. జబర్దస్త్ నా మనసు పెట్టి చేసిన సినిమా కాదు. ఇకపై మాత్రం నా మనసు చెప్పే కథనే చేస్తాను. ఆ కథను చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తాను.

కళ్యాణవైభోగమే స్టోరీ చాలామంది పెద్ద హీరోలకు వినిపించాను. కానీ అందరూ హీరోకు పెళ్లైపోవడమేంటి అంటూ పెదవి విరిచారు. అసలింతకీ పెద్ద హీరోలకెందుకు వినిపించడం. నా కథకు ఒక అబ్బాయి అమ్మాయి కావాలి కదా అని గుర్తొచ్చింది. అప్పుడే చందమామ కథలు సినిమాలో శౌర్యను చూసి బాగున్నాడు పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనిపించింది. తనకు కథ చెప్తే వెంటనే ఎగిరి గంతేశాడు. చాలా కాలం తర్వాత ఒక హీరోలో, ఈ కథ విన్నాక ఆ రేంజ్ రెస్పాన్స్ చూశాను.

సినిమాలో హీరోయిన్ స్మోకింగ్ చేస్తున్నట్లుగా ట్రైలర్ లో ఉంది. నిజానికి తను స్మోకింగ్ చేయదు. జస్ట్ సిగరెట్ పట్టుకుంటుంది అంతే. నేను ఢిల్ల్లీలో చదువుకుంటున్నప్పుడు క్లాస్ లో మెజారిటీ స్మోక్ చేయడం చూసి, ట్రై చేశా. కానీ ఆ పొగ, వాసన నాకసలు పడలేదు. ఇంకెప్పుడూ సిగరెట్ జోలికెళ్లలేదు. కానీ ఫ్రెండ్స్ కాలుస్తుంటే స్టైల్ గా సిగరెట్ ను జస్ట్ పట్టుకునేదాన్ని. అదే సినిమాలో వాడాను.

అలా మొదలైందిలో గే కామెడీ చాలా ఫ్యామస్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ తీయమంటే మాత్రం ఆ సీన్ తీయను. అప్పట్లో, పెద్దగా ఎవరికీ తెలీదు కదా అని అలా చేశాం. కానీ ఇప్పుడు తలచుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు.

బన్నీ ఇండస్ట్రీకి రాకముందు  నుంచీ నాకు మంచి ఫ్రెండ్. జబర్దస్త్ తర్వాత ఒక రోజు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. ఇంట్లో ఉన్నా అని చెప్తే తిట్టాడు, ఒక సినిమా రిజల్ట్ ఏదో తేడా వచ్చిందని, ఇంట్లో కూర్చుండిపోతావా అంటూ నన్ను ఎంకరేజ్ చేశాడు. నాకు చాలా సపోర్ట్ గా నిలిచాడు బన్నీ.

కళ్యాణవైభోగమే లో కామాక్షి అనే కోడి పుంజు  క్యారెక్టర్ ఉంటుంది. దానికి కూడా సినిమాలో కొంచెం రోల్ ఉంటుంది.చాలా మంది కోడిపుంజు ఎందుకు అంటున్నారు.(నవ్వుతూ). మా ఇంటి పక్కన రోజూ ఒక కోడి కనబడుతుంటుంది నాకు. రాజసంగా అటూ ఇటూ తిరుగుతుంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఒక కోడి క్యారెక్టర్ వాడితే బాగుంటుందనిపించింది. అప్పుడు కామాక్షి క్యారెక్టర్ పుట్టింది.

సినిమాలో కంటెంట్ ఉంటే, మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. కామెడీ సెపరేట్ ఉండాలి, లేకపోతే ఐటెం సాంగ్స్ ఉండాలి అనేది కేవలం డెకరేషన్ మాత్రమే. లోపల కంటెంట్ లేకపోతే సినిమా ఆడదు. ఒకవేళ కంటెంట్ ఉంటే, కామెడీ లేకపోయినా, సినిమా ఫెంటాస్టిక్ గా ఆడుతుంది. రీసెంట్ గా రిలీజైన నాన్నకు ప్రేమతోలో కామెడీ ఏముంది..అయినా గానీ సినిమా హిట్టయింది కదా..!

తాగుబోతు రమేష్ నిజంగా తాగి వస్తాడా అని చాలా మంది అడుగుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే అతనికి ఆ అలవాటు లేనే లేదు. తన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటననుంచి నేర్చుకుని, ఈ స్థాయికి చేరుకున్న రమేష్ అంటే నాకు చాలా గౌరవం. అతనికి తాగుడు అలవాటు లేదు. జస్ట్ యాక్టింగ్ మాత్రమే..

ఫినిషింగ్ నోట్
నేనే చాలా ఇష్టపడి మనసుపెట్టి తీసిని సినిమా కళ్యాణ వైభోగమే. అసలు ఎలాంటి టెన్షన్ కూడా లేదు నాకు. సినిమా అవుట్ పుట్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్తారు ఈ సినిమా ఎలాంటిదో. ఐయాం ఫుల్లీ హ్యాపీ ఎబౌట్ దిస్ మూవీ. ఈ ఏడాది హిట్స్ లో ఒకటిగా నిలబడుతుంది.

- లోకేష్ బండి