Read more!

English | Telugu

'సలార్', 'గుంటూరు కారం' ఒక్కటే.. లాజిక్స్ వెతక్కండి!

పులిహోరలో పులిని వెతకడం.. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ వెతకడం ఒకటేనని పలువురు అభిప్రాయపడుతుంటారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత నాగవంశీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టాలీవుడ్ లో తరచూ వార్తల్లో ఉండే నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. మీడియా, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడే మాటలు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సితార మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన 'గుంటూరు కారం' సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రోల్స్ కి మొదటి నుంచి ధీటైన సమాధానం ఇస్తూ వస్తున్న నాగవంశీ.. ఈసారి లాజిక్స్ విషయంలో 'సలార్' సినిమాతో పోల్చి మరీ 'గుంటూరు కారం'ని వెనకేసుకొచ్చారు.

తాజాగా ఒక రివ్యూయర్‌తో జరిపిన వీడియో సంభాషణలో.. లాజిక్స్ టాపిక్ మీద నాగవంశీ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెద్ద హీరోల సినిమాలు తీసేదే అభిమానుల కోసమని, అలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతకడంలో అర్థంలేదు అని అన్నారు. 'సలార్' సినిమాలో హీరో చేతి టాటూ చూసి విలన్ గ్యాంగ్‌ భయపడటంపై ఆయన స్పందిస్తూ.. ప్రభాస్ స్థాయి హీరోకు అలాంటి ఎలివేషన్ ఉండడం సమంజసమే అని, ఆ ఎలివేషన్లు అభిమానులకు నచ్చుతాయని అభిప్రాయపడ్డారు. అయితే కొందరు రివ్యూయర్స్ ఇలాంటి సీన్లను తప్పుబడతుంటారు. మరి భారీగా వసూళ్లను రాబట్టిన సలార్ విషయంలో సమీక్షకులు కరెక్టా? ప్రేక్షకులు కరెక్టా? అని నాగవంశీ ప్రశ్నించారు.

ఇక 'గుంటూరు కారం'లో హీరో పదే పదే గుంటూరు-హైదరాబాద్ ట్రావెల్ చేయడంపై వచ్చిన ట్రోల్స్ గురించి  నాగవంశీ మాట్లాడుతూ.. అలా కాకుండా ఎలా చూపిస్తారు? గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు మొత్తం చూపించి, మధ్యలో టీ తాగేది కూడా చూపించాలా అని క్వశ్చన్ చేశారు. 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ ను అభిమానులను అలరించడానికి పెట్టామని, అలాంటి పాటలో కూడా శ్రీలీల ఎలా వచ్చిందంటూ లాజిక్స్ వెతకడం ఏంటని నాగవంశీ ప్రశ్నించారు. మొత్తానికి అభిమానులను అలరించడానికి తీసే పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్స్ వెతకొద్దని ఆయన చెప్పుకొచ్చారు.