English | Telugu
హైడ్రా అక్కర్లేదు.. మేమే కూల్చేస్తాం.. మురళీమోహన్ సంచలన ప్రకటన!
Updated : Sep 8, 2024
హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న హైడ్రా దూకుడుగా పనిచేస్తోంది. చెరువులను, కాలువలను ఆక్రమించి ఉన్న నిర్మాణాలను ఇప్పటికే ఎన్నో కూల్చి వేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణం కనిపిస్తే చాలు పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కు నోటీసులు జారీ చేసింది.
మురళీమోహన్ కు చెందిన జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు యొక్క బఫర్ జోన్ పరిధిలో కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఈ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఆ నిర్మాణాలను కూల్చివేయాలని, లేకుంటే తామే కూల్చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొంది.
హైడ్రా నోటీసులపై తాజాగా మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎప్పుడూ ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు. బఫర్‌జోన్‌లో మూడడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆ తాత్కాలిక రేకుల షెడ్డును తొలగించడానికి హైడ్రా అధికారులు రానక్కర్లేదు, రెండు రోజుల్లో తామే కూల్చేస్తామని మురళీమోహన్ తెలిపారు.