English | Telugu

రియల్‌ లైఫ్‌లో కూడా హీరోగా ఉండాలి : అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌పై ఎం.పి. చామల!

పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన తాలూకు సెగలు ఇంకా చల్లారలేదు. ఏదో ఒక రూపంలో ఈ ఘటన చర్చకు వస్తోంది. ఈ 19 రోజుల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. హీరోపైనా, చిత్ర యూనిట్‌పైనే ఎంతో మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో లేవనెత్తినపుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దానిపై వివరణ ఇస్తూ మాట్లాడిన మాటలు పెద్ద చర్చకు దారి తీశాయి. దీనిపై శనివారం సాయంత్రం అల్లు అర్జున్‌ అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ మీడియా సమావేశంపై భువనగిరి ఎం.పి., కాంగ్రెస్‌ నేత ఆదివారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 

‘రేవంత్‌రెడ్డిగారు అసెంబ్లీలో సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన దానికి వెంటనే స్పందించిన అల్లు అర్జున్‌ హుటాహుటిన ప్రెస్‌మీట్‌ పెట్టారు. అయితే సమావేశంలో పాజిటివ్‌గా స్పందిస్తారని, తమ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగింది, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే సందేశాన్ని ఇస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ, ముఖ్యమంత్రి తనని కించ పరచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్క్రిప్ట్‌ని పక్కన పెట్టుకొని దాని ప్రకారమే మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రిగారు ప్రజల నుద్దేశించి ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు తప్ప అల్లు అర్జున్‌ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు. అల్లు అర్జున్‌ గారూ.. మీరు థియేటర్‌లో ఉన్నప్పుడే బయట ఈ దుర్ఘటన జరిగింది. బయట అంబులెన్స్‌ సౌండ్స్‌ అన్నీ వినపడుతూనే ఉంటాయి. కానీ, మీరు సినిమా మీదే శ్రద్ధ పెట్టి పూర్తిగా సినిమా చూసి వెళ్లారు. పైగా మరుసటి రోజు విషయం నాకు తెలిసిందని అన్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్‌ చేసింది అనే దానిపైనే మీ ధ్యాస ఉంది కానీ.. థియేటర్‌ దగ్గర ఏం జరిగింది అనే విషయం గురించి మీరు పట్టించుకోలేదు. నిన్న ప్రెస్‌మీట్‌లో బాధ్యతగా మాట్లాడుతున్నట్టు లేదు. ఒక స్క్రిప్ట్‌ తీసుకొచ్చి దాన్నే చదివినట్టుగా అనిపించింది. మీరు చేసే సినిమాల్లో మూడు గంటలు హీరోగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తారు. అదే విధంగా రియల్‌ లైఫ్‌లో కూడా హీరోగా ఉండాలని కోరుకుంటున్నాం’ అన్నారు.