English | Telugu
ఆ విషయాల గురించి సభ్యులు మాట్లాడవద్దు : ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు!
Updated : Dec 25, 2024
చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి ఎప్పుడూ సత్సంబంధాలు ఉంటాయి. ఇది ఎన్నో దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అయితే ఇటీవలికాలంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై కావాలనే దురుసుగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరో పక్క చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్లిపోతుందనే ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి.. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి ప్రోత్సాహం ఎంతోఉంది. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఓ విన్నపం చేయదలుచుకున్నాం. సున్నితమైన విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించొద్దు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల.. సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ‘మా’ సభ్యులకు ఐక్యత అవసరం’ అంటూ తమ ప్రకటనలో తెలియజేసింది ‘మా’.