English | Telugu
Maadhavi Latha : మన బతుకులంతా ఇంతేనా?.. మాధవి లత సంచలనం!
Updated : Nov 9, 2023
ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీలు కుల రాజకీయాలకు తెరదీస్తాయి. అధికారంలోకి రాకపోవడమే లక్ష్యంగా ప్రజలను కులాలుగా విభజించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఇలాగే ఉంది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు పార్టీలన్నీ కులాల జపం చేస్తున్నాయి. తాము దళితులకు సీట్లు ఎక్కువ ఇచ్చామని ఒకరు, తాము బీసీని సీఎం చేస్తామని మరొకరు.. ఇలా దాదాపు అందరూ ఆ కులానికి ప్రాధాన్యత ఇస్తాం, ఈ కులానికి ప్రాధాన్యత ఇస్తామంటూ చెబుతున్నారు. ఒక్కరు కూడా ప్రతిభకు పట్టం కడతామని చెప్పడంలేదు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తమ పార్టీ ఇలా కులాలను అడ్డుపెట్టుకొని మాయమాటలు చెబుతుందని, దీని వల్ల ప్రతిభావంతులు నష్టపోతున్నారని.. ఆయా పార్టీలలో ఉండే నాయకులకు, కార్యకర్తలకు తెలుసు. అయినప్పటికీ ఇతర పార్టీల మీద విమర్శలు చేస్తారు కానీ, తమ పార్టీ కూడా అదే తప్పు చేస్తుందని ఒక్కరు కూడా నిజాయితీగా ఒప్పుకోరు. కానీ ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత మాధవి లత మాత్రం తమ పార్టీ కూడా తప్పు చేస్తుందని ఒప్పుకోవడమే కాకుండా.. అన్ని పార్టీలను నిర్భయంగా నిలదీశారు.
ప్రస్తుత రాజకీయాల పార్టీల తీరుపై మాధవి లత సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. "నాకు అర్థంకాదు. మా పార్టీతో సహా అందరూ దళితులకు సీట్లు ఇస్తాం, బీసీలకు పొజిషన్ ఇస్తాం అంటున్నారు. టాలెంట్ కి ఇవ్వరా? మన బతుకులంతా ఇంతేనా?. ప్రజలే అలా ఉన్నారులే.. మా కులానికి ఏం ఇస్తున్నారని. ఇలా అనుకునే దేశం టాలెంట్ ని పక్కన పెట్టి, కులాల కుంపట్లకి జాబ్స్ ఇస్తే అన్ని చోట్లా బ్రెయిన్ లెస్ ఫెలోస్ జాబ్స్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్నవాళ్లు జాబ్ చెయ్యట్లేదు. ఈ దేశంలో టాలెంట్ ఉన్నవాళ్ళకి పొజిషన్స్ ఎప్పుడొస్తాయి?. ఇది నా కడుపు మంట. ఎందుకంటే, కులం నాకు కూడు పెట్టలేదు. ముఖ్యంగా నేను అమ్మాయిని కనుక. మాది సెపెరేట్ జాతి. అణగారిన జాతి మాది. మరి మాకేం ఇవ్వరా?" అంటూ మాధవి లత రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంత నిజాయితీగా, నిర్భయంగా కుల రాజకీయాలను ఎండగడుతూ.. ప్రతిభకు పట్టం కట్టాలని మాధవి లత చేసిన ప్రశంసలు కురుస్తున్నాయి.