English | Telugu

'లక్కీ భాస్కర్' బిజినెస్.. తెలుగులో టాప్, కేరళలో వీక్...

'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ తెలుగు మిడ్ రేంజ్ హీరోల స్థాయిలో ఉండటం విశేషం. (Lucky Baskhar Business)

'లక్కీ భాస్కర్' చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.15 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో రూ.6 కోట్లు, ఆంధ్రాలో రూ.6.8 కోట్లు, సీడెడ్ లో రూ.2.2 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు యువ హీరోల సినిమాలతో పోలిస్తే ఇది మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. దుల్కర్ నటించిన గత రెండు తెలుగు సినిమాలు మంచి విజయం సాధించడంతో పాటు, వెంకీ అట్లూరి-సితార బ్యానర్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం 'సార్' మంచి విజయం సాధించడంతో తెలుగునాట 'లక్కీ భాస్కర్'కి మంచి బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే దుల్కర్ కేరళ హీరో అయినప్పటికీ.. డబ్బింగ్ సినిమా కావడంతో అక్కడ రూ.3 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. ఇక కర్ణాటకలో రూ.1.5 కోట్లు, తమిళనాడులో రూ.1.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ.. రెస్టాఫ్ ఇండియా రూ.2 కోట్లు, ఓవర్సీస్ రూ.4 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఈ సినిమా రూ.27 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.