English | Telugu
Lubber Pandhu : లబ్బర్ పందు మూవీ రివ్యూ
Updated : Nov 2, 2024
మూవీ : లబ్బర్ పందు
నటీనటులు: హరీశ్ కళ్యాణ్, దినేష్ రవి, సంజనా కృష్ణమూర్తి తదితరులు
ఎడిటింగ్: మదన్ గణేశ్
మ్యూజిక్: సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
నిర్మాతలు: లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం: తమిళరాసన్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
తమిళనాడులోని ఓ గ్రామంలో అభి ఉంటాడు. అతనికి చిన్నతనం నుండి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఎప్పటికైనా తనకిష్టమైన ఆటలో గొప్పగా ఆడాలనుకుంటాడు. ఇక ఊళ్ళో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్ లో అయిన ఎక్స్ ట్రా ప్లేయర్ కావాలన్నా అభినే తీసుకుంటారు. దీంతో పాటు దుర్గ అనే అమ్మాయిని అభి ప్రేమిస్తుంటాడు. ఓసారి పక్క ఊళ్లో జరిగే మ్యాచ్ కి అభి వెళ్తాడు. ఆ మ్యాచ్ లో శేషు(దినేష్ రవి) ని ఓడిస్తాడు అభి. చుట్టు పక్కల ఊళ్ళలో క్రికెట్ లో శేషు తరువాత అందరు గొప్పగా చెప్పుకునే పేరు అభి. అందువలన అతనంటే శేషు కోపంగా ఉంటాడు. తన చెల్లెలు అతనిని ఇష్టపడిందని తెలిసిన దగ్గర నుంచి అభిపై కోపం మరింతగా పెరుగుతుంది. అభితో దుర్గ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో శేషు - అభి కలిసి ఒకే టీమ్ లో ఆడవలసి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అభి, దుర్గల పెళ్ళి జరిగిందా లేదా అసలు శేషు, అభి కలిసిపోయారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
లబ్బర్ పందు అనేది తమిళ పదం. దీనికి అర్థం 'లబ్బర్ బంతి'. విలేజ్ లో రబ్బర్ బంతితో మొదటగా క్రికెట్ స్టార్ట్ చేస్తారు. అలాంటి ఆట చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు.. అక్కడి యువకులకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తూ దర్శకుడు చెప్పిన కథ ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఎందుకంటే ఇది చాలా నేచురల్ గా ఉంది. ప్రతీ ఆడియన్ తమని తాము స్క్రీన్ పై చూసుకునేలా సినిమాని తెరకెక్కించారు.
మన ఊళ్లో జరిగే కథే ఇది. అయితే ఇందులో క్రికెట్ తో పాటు ప్రేమకథని జోడించారు. అంతా సహజంగా కథ కదులుతూ ఉంటుంది. లవ్, ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగా కుదిరాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా బాగా కనెక్ట్ అవుతారు. రొమాన్స్ గట్రా లేకపోయిన ఆ లోటు తెలియకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
క్రికెట్ మ్యాచ్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. అయితే పాత్రల పరిచయానికి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అశ్లీల పదాలు వాడలేదు. ఫ్యామిలీతో కలసి చూసేలా తీశారు మేకర్స్. దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గ్రామీణ నేపథ్యంలో లొకేషన్స్ ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం బాగుంది. మదన్ గణేశ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఇగో పక్కన పడితే జీవితం మరింత అందంగా కనిపిస్తుందనే మెసెజ్ బాగుంది.
నటీనటుల పనితీరు:
అభిగా హరీశ్ కళ్యాణ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. శేషుగా దినేష్ రవి, దుర్గాగా సంజన కృష్ణమూర్తి ఆకట్టుకున్నారు. ఇక మిగతావారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా :
ఈ రబ్బర్ బంతి మీ బాల్యాన్ని గుర్తుచేస్తూ మిమ్మల్ని గ్రౌండ్ లోని క్రికెట్ మ్యాచ్ కి తీసుకెళ్తుంది.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్