Read more!

English | Telugu

'ఆచార్య' తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కొరటాల!

'మిర్చి' వంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. ఆ తర్వాత అదే జోరుని కొనసాగిస్తూ 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయనకు ఐదో సినిమా మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. అదే 2022 ఏప్రిల్ లో వచ్చిన 'ఆచార్య'. 

చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రల్లో కొరటాల రూపొందించిన 'ఆచార్య' సినిమా భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దర్శకుడిగా కొరటాలకి ఇదే మొదటి పరాజయం. అలాగే ఈ సినిమా కారణంగా కొరటాల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆచార్య పరాజయానికి కారణం కొరటాలే అనేలా చిరంజీవి పరోక్షంగా కామెంట్స్ చేశారు. దానికితోడు, ఆ సినిమా ఫైనాన్షియల్ విషయాలను కొరటాల చూసుకోవడంతో.. విడుదల తర్వాత బయ్యర్ల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా కొరటాల కెరీర్ లో 'ఆచార్య' అనేది ఓ మచ్చలా మిగిలిపోయింది. అయితే ఆ సినిమా వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా మీడియాకి ముఖం చాటేసిన ఆయన.. మొదటిసారి మీడియా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో 'దేవర' చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ మూవీ లాంచ్ సందర్భంగా స్టేజ్ మీద కథ ఎలా ఉండబోతుందో చెప్పడమే తప్ప.. ఈ రెండేళ్లలో కొరటాల మీడియాతో ముచ్చటించింది గానీ, ఇంటర్వ్యూ ఇచ్చింది గానీ లేదు. అలాంటి కొరటాల ఇప్పుడు మీడియా ముందుకు రాబోతున్నాడట.

సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ'(Krishnamma) చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల ఈ సినిమాకి సమర్పకుడు. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన రంగంలోకి దిగబోతున్నాడట. మూవీ టీంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడంతో పాటు, ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రెస్ మీట్ నిర్వహిస్తే.. 'దేవర', 'ఆచార్య' సినిమాల గురించి ప్రశ్నలు ఎదురుకావడం సహజం. దీంతో 'ఆచార్య' చిత్రం గురించి కొరటాల ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.