English | Telugu

‘ఖడ్గం’ రీ రిలీజ్‌.. కొత్త వివాదాలకు తెర తీయనుందా?

90వ దశకంలో ఉన్న డైరెక్టర్లలో కృష్ణవంశీది ఓ విభిన్నమైన శైలి. అతను ఒక జోనర్‌కే పరిమితం కాకుండా అన్ని రకాల జోనర్స్‌ని టచ్‌ చేసిన డైరెక్టర్‌. తను చేసిన ప్రతి సినిమా భిన్నమైన కథ, కథాంశాలతో ఉంటుంది. ఫ్యామిలీ, సెంటిమెంట్‌, యాక్షన్‌, దేశభక్తి ప్రధాన చిత్రాలు.. ఇలా అన్నీ అతని ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా సిందూరం, ఖడ్గం చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణవంశీ కెరీర్‌లో ఖడ్గం చిత్రం ఓ మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు వంశీ. ఈ సినిమా అప్పట్లో కొన్ని వివాదాలకు కారణమైంది. సెన్సార్‌లో కూడా ఈ సినిమాకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని కట్స్‌తోపాటు కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్‌ చేశారు. ఈ సినిమాలో ఉగ్రవాదాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అలాంటిది. దర్శకుడిగా కృష్ణవంశీకి, నిర్మాతగా సుంకర మధుమురళికి చాలా మంచి పేరు తెచ్చింది ఖడ్గం. అంతేకాదు, ఈ సినిమాకి పలు విభాగాల్లో నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు లభించాయి. రవితేజ, ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌లకు కూడా ఈ సినిమా మైల్‌స్టోన్‌ అని చెప్పొచ్చు. 

ఇటీవలికాలంలో రీరిలీజ్‌ల ట్రెండ్‌ ముమ్మరంగా నడుస్తోంది. గతంలో సూపర్‌హిట్‌ అయిన ఎన్నో సినిమాలు రీరిలీజ్‌ అయి మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా కృష్ణవంశీ తెరకెక్కించిన మురారి చిత్రం కూడా రీరిలీజ్‌ అయి మరోసారి సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడా బాటలో కృష్ణవంశీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఖడ్గం రిలీజ్‌ కాబోతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మొదట ఈ సినిమా రిలీజ్‌ అయిన సమయానికి, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సోషల్‌ మీడియా బాగా పెరిగింది. అంతేకాదు, సెన్సార్‌ విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సెన్సార్‌ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తే పాత వెర్షన్‌ను యధాతథంగా రిలీజ్‌ చేస్తారా లేక మళ్ళీ సినిమాలో కటింగ్స్‌ ఏమైనా ఉంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా జెమిని టీవీలో చాలాసార్లు టెలికాస్ట్‌ అయ్యింది. ఎక్కడెక్కడ కట్స్‌ వేశారు, ఎన్ని డైలాగుల్ని మ్యూట్‌ చేశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖడ్గం చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్‌ చెయ్యడం వల్ల ఏమైనా కొత్త సమస్యలు వస్తాయా అనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాలో బాగా హైలైట్‌ అయిన సీన్‌ ఒకటుంది. ఇండియా, పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినపుడు పాకిస్తాన్‌ గెలిస్తే హైదరాబాద్‌లోనే ఉంటూ ఆ దేశానికి మద్దతు తెలిపే కొందరు పాకిస్తాన్‌ జెండాను ఎగురవేస్తూ, ఇండియా జెండాను కాల్చే ప్రయత్నం చేస్తారు. దాన్ని శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాష్‌రాజ్‌ అడ్డుకొని వాళ్ళను చావగొడతారు. ఇప్పుడీ సీన్‌ థియేటర్‌లో ప్రదర్శిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, పాకిస్తాన్‌ని ఉద్దేశించి చాలా డైలాగులు రాశాడు రచయిత ఉత్తేజ్‌. అప్పట్లో వాటిపై వివాదం కూడా చెలరేగింది. సోషల్‌ మీడియా విస్తృతంగా పెరిగిన ఈరోజుల్లో ఖడ్గం సినిమా రిలీజ్‌ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సినిమా ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.