English | Telugu

Kavi Samrat Movie Review: కవి సమ్రాట్ మూవీ రివ్యూ

 

మూవీ : కవి సమ్రాట్
నటీనటులు: ఎల్బీ శ్రీరామ్, టీఎన్ఆర్, అనంత్ బాబు, రామజోగయ్య శాస్త్రి, రాజ్ కందుకూరి, చెల్లి స్వప్న , రాకీ
మ్యూజిక్: జ్యోష్యభట్ల
సినిమాటోగ్రఫీ: రాం కిరణ్ రెడ్డి
ఎడిటింగ్: సతీష్ మల్లెల
దర్శకత్వం: సవిత్ సి చంద్ర
నిర్మాత: ఎల్బీ శ్రీరామ్

కథ: 

విశ్వనాథ సత్యనారాయణ (ఎల్బీ శ్రీరామ్) రచయిత అవ్వాలని అనుకుంటున్నట్టుగా తండ్రి శోభానాధ్రి(రామజోగయ్య శాస్త్రి)కి చెప్తాడు. దానికి శోభానాధ్రి ఒప్పుకోడు. బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్తాడు. తండ్రి మాటని కాదనలేక ఉద్యోగంలో చేరతాడు. కానీ అతనిలోని కవిని మర్చిపోలేక మళ్ళీ కవిత్వం రాస్తుంటాడు. అయితే విశ్వనాథ సత్యనారాయణ  తన తండ్రి కలకి నెరవేర్చాలని సంకల్పిస్తాడు. వారి ఊరిలోని శివాలయాన్ని బాగుచేయాలని విశ్వనాథ సత్యనారాయణ భావిస్తాడు. మరి కవితలు, నవలలు రాసిన డబ్బుతో విశ్వనాథ సత్యనారాయణ ఆ కలని నెరవేర్చగలిగాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

కవి సమ్రాట్ ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన భాగాలని వివరిస్తూ తీసుకొచ్చిన సినిమానే ఈ ' కవి సమ్రాట్'. సినిమా కథంటే కొన్ని పాటలు, కొన్ని ఫైట్లు, కొంత సస్పెన్స్ ఉండాలని భావించే నేటి తరం యువతరానికి ఈ కథ ఓ లెస్సెన్ అవుతుంది. కానీ దానిని వారు ఎంతవరకు ఆదరిస్తారనేది వారి ఇష్టం. 

ఇది సినిమా అనేకంటే కవిసమ్రాట్ జీవితం అనేయొచ్చు. ఎల్బీ శ్రీరామ్ గారు ఆ పాత్రలో లీనమయ్యారు. అతడినే చూస్తున్నామా అనేంతలా ప్రతీ మాటా, ప్రతీ పద్యం అతడిని ప్రతిబింబించేలా ఉన్నాయి. 

దీని నిడివి కూడా ఒక గంట మాత్రమే. ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో కథ సాగుతుంది. తెలుగు కవులలో మొట్టమొదటి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'రామాయణ కల్పవృక్షము', 'వేయిపడగలు' నవల వెనుక దాగి ఉన్న స్థితిగతులు ఇందులో చక్కగా వివరించారు. ఈ సినిమా కేవలం కవులనే కాదు.. ప్రతీ ఒక్కరికి నచ్చేస్తుంది. అడల్ట్ సీన్లు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు.. తెలుగు బాషని, తెలుగు కవిత్వాన్ని గౌరవించే విధంగా ఇందులోని పాత్రలని డిజైన్ చేశారు మేకర్స్.  

ఉప్పుని ఉప్పగా ఉందని అంటాం.. కారాన్ని కారంగా ఉందని అంటాం.. కానీ చక్కెరని ఎందుకు తియ్యగా ఉందని అంటాంమని ఎల్బీ శ్రీరామ్ గారు చెప్పే డైలాగ్స్ అందరికి గుర్తుండిపోతాయి. కవికి గర్వం ఉండాలా వద్దా అని అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం ఆలోచింపజేస్తుంది. ఎంత గొప్పగా అనుభవాల్ని పోగేసుకుంటే అంత గొప్పగా అక్షరాల్ని పేర్చగలం అనే డైలాగ్ కవి లోతైన, గాఢమైన భావాన్ని తెలియజేస్తుంది. జ్యోష్యభట్ల సంగీతం బాగుంది‌. రాం కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

విశ్వనాథ సత్యనారాయణ గారిలా ఎల్బీ శ్రీరామ్ గారు ఒదిగిపోయారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే స్వయంగా ఎల్బీ శ్రీరామ్ లో ఆవహించాడా అనేంతలా నటించారు‌. ఇక టీఎన్ఆర్, అనంత్ బాబు తమ ‌నటనతో మెప్పించారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : కవిసమ్రాట్ నేటి తరానికి దిక్సూచి. తెలుగు వారు చూడాల్సిన నిలువెత్తు కల్పవృక్షం.

✍️. దాసరి మల్లేశ్