English | Telugu

‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్‌ ఆగిపోయింది.. షాకిచ్చిన డైరెక్టర్‌.. అసలేం జరిగింది? 

రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కాంతార చాప్టర్‌ 1’ షూటింగ్‌ కర్ణాటకలో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. సోమవారం ఈ సినిమా షూటింగ్‌ నిలిపివేసినట్టు డైరెక్టర్‌ రిషబ్‌శెట్టి ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే షూటింగ్‌ ఎందుకు ఆపేశారనే విషయం మొదట్లో అక్కడి వారికి తెలీలేదు. చిత్ర యూనిట్‌కి ప్రమాదం జరిగిన కారణంగానే షూటింగ్‌ ఆపారని మీడియాలో వార్తలు రావడంతో అసలు విషయం తెలిసింది. 

అసలేం జరిగిందంటే.. జడ్కల్‌లోని మూడూరులో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆదివారం రాత్రి షూటింగ్‌ ముగించుకొని యూనిట్‌లోని 20 మంది సభ్యులు ఒక మినీ బస్సులో కొల్లూరు బయల్దేరారు. మార్గమధ్యంలో ఆ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మిగతా యూనిట్‌లోని ప్రధాన సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఆ కారణంగా సోమవారం షూటింగ్‌ నిలిపివేస్తున్నట్టు హీరో, దర్శకుడు రిషబ్‌షెట్టి ప్రకటించారు.

కన్నడలో రూపొందిన ‘కాంతార’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.450 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్‌శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. సాధారణంగా ఏ సినిమాకైనా సీక్వెల్‌ ఉంటుంది. కానీ, కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథ, కథనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రిషబ్‌ కలరిపయట్టు యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు.