English | Telugu

జపాన్‌ భాషలో ‘కల్కి’ సందడి.. జనవరి 3 నుంచి మొదలు!

ప్రపంచంలోని పలు భాషల్లో ఇండియన్‌ సినిమాలు రిలీజ్‌ అవ్వడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు ఇతర దేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. బాహుబలితో తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా చైనా, జపాన్‌ భాషల్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా జపాన్‌ భాషల్లో విడుదలైంది. తాజాగా ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘కల్కి 2898ఎడి’ చిత్రాన్ని జపాన్‌ భాషలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేయబోతున్నారు. జనవరి 3న ఈ చిత్రాన్ని దాదాపు 200 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. అలాగే రష్యా, చైనాలలో కూడా కల్కి చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. 

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కి కూడా జపాన్‌లో మంచి ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు అక్కడ విడుదలై ఘనవిజయం సాధించాయి. ఈమధ్యకాలంలో బాహుబలి చిత్రానికి జపాన్‌లో భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత దాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ క్రాస్‌ చేసింది. కల్కి చిత్రానికి ఉన్న పాపులారిటీని బట్టి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌ని కూడా దాటి వెళ్ళే అవకాశం ఉంది అనిపిస్తుంది. కల్కి చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేస్తున్నట్టు ఒక ఎనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది వైజయంతి మూవీస్‌ సంస్థ.