Read more!

English | Telugu

ప్రముఖ మళయాళ హీరో జిష్ణు రాఘవన్ మృతి

మొన్నటి వరకూ తెలుగు పరిశ్రమను ఊపేసిన మరణాలు, ఇప్పుడు మళయాళ పరిశ్రమ వైపు మళ్లాయి. నటి కల్పన, సింగ్ షాన్ జాన్సన్, రాజేశ్ పిళ్లై, కళాభవన్ మణి లాంటి మాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరసగా ఈ ఏడాది మరణించారు. వరసపెట్టి ప్రముఖులు మరణిస్తుండటంతో, మళయాళ చిత్రపరిశ్రమ షాక్ కు గురవుతోంది. విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిని ఇంకా మరువక ముందే, ప్రముఖ నటుడు జిష్ణు రాఘవన్ కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం పొద్దున్న 8 గంటల సమయంలో కొచ్చిలోని అస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు. ఆయనకిప్పుడు 35 ఏళ్లు. ప్రముఖ మళయాళ నటుడు రాఘవన్ తనయుడే జిష్ణు.

1987లో కిల్లిపట్టు అనే సినిమాలో బాలనటుడి పాత్ర ద్వారా మొట్టమొదటి సారి జిష్ణు స్క్రీన్ పై కనిపించారు. చదువు పూర్తైన తర్వాత పూర్తి స్థాయి హీరోగా రంగప్రవేశం చేసి, తన మొదటి సినిమా నమ్మాల్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఆయన, ఒక ఆర్కిటెక్ట్ ను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. గతంలోనే ఆయన క్యాన్సర్ తో పోరాడి బయటపడినా, అది మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. చికిత్సా సమయంలోనే ఆయన కన్నుమూశారు. బెడ్ మీద ఉన్నప్పుడు కూడా, తన ఇన్ స్పిరేషనల్ మేసేజ్ లతో, ఫ్యాన్స్ లో ధైర్యాన్ని నింపేవారు. ఆయన మృతి పట్ల మళయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.