English | Telugu

జనసేన నుంచి జానీ మాస్టర్ సస్పెండ్.. దటీజ్ పవన్ కళ్యాణ్!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. అనేకసార్లు తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 21 ఏళ్ళ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదైంది.

పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో.. పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది." అని ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై కేసు నమోదైన గంటల వ్యవధిలోనే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పవన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా, ఇటీవల తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.