English | Telugu

ఉచ్చు బిగుసుకుంటోంది.. జానీ మాస్టర్‌కి షాక్‌ మీద షాక్‌!

ఈమధ్యకాలంలో టాలీవుడ్‌లో వివాదాల జోరు బాగా పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ రకరకాల వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆమధ్య కొంతకాలం రాజ్‌తరుణ్‌, లావణ్య, మాల్వీ మల్హోత్రా కేసు, నటి హేమ డ్రగ్స్‌ కేసు, సినిమా రంగంలోని వారి జాతకాలు బట్టబయలు చేస్తున్నాడని వేణు స్వామిపై ఆరోపణలు.. ఇలా ఇండస్ట్రీ అంతా గందరగోళంగా మారిపోయింది. ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని అతని అసిస్టెంట్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు వారి పరిధిలోకి రాదు కాబట్టి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కి బదిలీ చేశారు. 

నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టి ఆ యువతి ఇంటికి వెళ్లి మూడు గంటలపాటు విచారించి వివరాలు సేకరించారు. ఆమె చేసిన ఆరోపణల ఆధారంగా జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసుల ఎదుట జానీకి సంబంధించి ఆ యువతి చాలా విషయాలు బయటపెట్టిందని తెలుస్తోంది. నార్సింగిలోని తన ఇంట్లోనే తనపై జానీ చాలాసార్లు లైంగిక దాడి చేశాడని ఆ యువతి ఆరోపించింది. తన మతంలోకి మారి తనని పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని, షూటింగ్‌లో ఉన్నప్పుడు క్యారవాన్‌లోకి వచ్చి హింసించేవాడని చెప్పింది. తన మాట వినకపోతే ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడని పేర్కొంది. గత కొన్నేళ్ళుగా ఇలాగే జరుగుతోందని, ఇక అతని అరాచకాలు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. యువతి చెప్పిన వివరాల ఆధారంగానే కేసు నమోదు చేసినట్టు ఎస్‌.హెచ్‌.ఓ. హరికృష్ణారెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే... గత కొంతకాలంగా జనసేన పార్టీకి జానీ విధేయుడిగా ఉన్నాడు. అయితే అతనిపై కేసు నమోదు కావడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో తాను నిరపరాధినని ప్రూవ్‌ చేసుకుంటే తప్ప మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు. ఈ కేసు కారణంగానే కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించే ఆలోచనలో సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. జానీ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు సభ్యులు సమావేశమయ్యారట. అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అనివార్యమని సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొరియోగాఫ్రర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌కి ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుగున్నాయి. ఓ పార్టీ నుంచి సస్పెన్షన్‌, మరో పక్క ఎంతో ప్రతిష్టాత్మకమైన కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ నుంచి వ్యతిరేకత రావడం.. ఇవన్నీ స్వయంకృతాపరాధమేనని అసోసియేషన్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కేసు విషయంలో జానీ మాస్టర్‌ స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.