English | Telugu

టైటానిక్‌, అవతార్‌ తర్వాత జేమ్స్‌ కేమెరూన్‌ నుంచి రాబోతున్న సెన్సేషనల్‌ మూవీ ఇదే!

ప్రపంచ సినిమాలో జేమ్స్‌ కేమెరూన్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హాలీవుడ్‌ చరిత్రలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎన్నో సందర్భాల్లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన ఘనాపాటి కేమెరూన్‌. 1978లో ఓ షార్ట్‌ ఫిలింతో డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టిన కేమెరూన్‌ ఆ తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఆయన రూపొందించిన సినిమాల్లో ఫిరానా 2, ది టెర్మినేటర్‌, ఎలియన్స్‌, ది అబీస్‌, టెర్మినేటర్‌ 2, ట్రూ లైస్‌ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. 1997లో కేమెరూన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన టైటానిక్‌ చరిత్ర సృష్టించింది. 200 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 2,264 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి కొత్త హిస్టరీని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు కేమెరూన్‌. దాదాపు 12 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అవతార్‌ అనే అద్భుతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందరూ అబ్బురపడేలా ఓ విజువల్‌ వండర్‌ని, ఓ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు కేమెరూన్‌. అవతార్‌ సిరీస్‌లో ఐదు భాగాలు ఉంటాయని ప్రకటించారు. ఇప్పటికే అవతార్‌ 2 ది వే ఆఫ్‌ వాటర్‌ రిలీజ్‌ అయింది. అవతార్‌ 3 ఫైర్‌ అండ్‌ యాష్‌ చిత్రాన్ని 2025 డిసెంబర్‌ 19న విడుదల చేయబోతున్నారు. 2029లో అవతార్‌ 4, 2031లో అవతార్‌ 5 చిత్రాలను రిలీజ్‌ చేసేందుకు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు కేమెరూన్‌. 

అవతార్‌ సిరీస్‌ తర్వాత తను చేయబోయే సినిమాకి సంబంధించి కేమెరూన్‌ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిసోంది. ఆ సినిమా పేరు లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబుల దాడి, దాని పర్యవసానాలు ప్రధానాంశంగా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ఓ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. చార్లెస్‌ పెల్లెగ్రినో రచించిన ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా బుక్‌ హక్కులను భారీ మొత్తం చెల్లించి కేమెరూన్‌ కొనుగోలు చేశారు. 2025 ఆగస్ట్‌లో ఈ పుస్తకం మార్కెట్‌లోకి రాబోతోంది. ఇప్పటివరకు కేమెరూన్‌ రూపొందించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుంది. అయితే ఈ కథాంశాన్ని సెలెక్ట్‌ చేసుకోవడానికి రీజన్‌ ఏమిటి అనేది మాత్రం కేమెరూన్‌ ప్రస్తావించలేదు. 

రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టపోయిన దేశం జపాన్‌. అమెరికా చేసిన అణుబాంబుల దాడిలో దాదాపు 2 లక్షల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు స్మశానాలుగా మారిపోయాయి. అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అతని పేరు సుటోము యమగుచి. అతను ఓ ఇంజనీర్‌. అతని జీవితం ఆధారంగా ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా పుస్తకాన్ని రచించారు. యమగుచి కథను సినిమాగా తెరకెక్కించేందుకు కేమెరూన్‌ సిద్ధమవుతున్నారు. అణుబాంబుని కనిపెట్టిన అమెరికన్‌పై క్రిస్టోఫర్‌ నోలన్‌.. ఓపెన్‌ హైమర్‌ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి 7 ఆస్కార్‌ అవార్డులు లభించాయి. అయితే కేమెరూన్‌ దానికి భిన్నంగా హిరోషిమా, నాగసాగిలపై అమెరికా బాంబు దాడులపై సినిమా తియ్యాలని డిసైడ్‌ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.