English | Telugu
తారక్‌లో అప్పటికీ ఇప్పటికీ ఏంత తేడా!
Updated : Sep 4, 2017
తారక్ లో పోనుపోనూ మెచ్యూరిటీ లెవల్స్ పెరిగిపోతున్నాయ్. ఇదివరకు తారక్ కు ఇప్పటి తారక్ కూ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పాత్రల ఎంపికలోనూ, బిగ్ బాస్ షో నిర్వహించే తీరులోనూ ఆ పరిపక్వత కనిపిస్తోంది. దీంతోపాటు... ‘జై లవకుశ’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఎన్టీయార్ ఆచితూచి మాట్లాడిన తీరు కూడా బహు ముచ్చటగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గురించి తను మాట్లాడిన విధానానికి నిజంగా ఎవరైనా ఫ్లాటైపోవాల్సిందే. ‘17ఏళ్ల క్రితం ఫ్లైట్లో కలిశాం. తొలిసారి కలిసుకున్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యామో... ఇప్పుటికీ అదే ఉద్వేగానికి లోనవుతుంటామ్. నిజంగా దేవి చాలా గ్రేట్. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు అసామాన్యం. ఎంతటి బంధమైనా సరే... చిన్న ‘ఇగో’ సమస్యవల్ల... పేకమేడలా కూలిపోతుంది. కానీ... నేటికీ ఆయనకు ఇగో అనేది ఇసుమంతైనా లేదు.
ఫోన్ చేసి ‘ఈ పాటొద్దు ఇంకో పాట పంపుతావా? ప్లీజ్’ అని అడిగితే... అస్సలు ఫీలవ్వడు. ‘ఛ..ఛ..ఛ.. తారక్.. నువ్వలా అడగొద్దు... చెప్పు అంతే. రేపు ఇంకో ట్యూన్ ఉంటుంది సరేనా’అంటాడు. అంత మంచి మనిషి ఆయన’అని ఎంతో ఉద్వేగానికి లోనవుతూ చెప్పాడు తారక్. అంతేకాదు.. తన అన్న కల్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ ‘అన్నయ్యను నేను నిర్మాతగా చూడను. అలా అంటే నేను భరించలేను. ఆయన నాకు అన్న మాత్రమే కాదు. నాన్న తర్వాత ఇంకో నాన్న. కని పెంచిన తండ్రి గొప్పతనం ఎవరూ చెప్పలేరు. మా అన్నయ్య గొప్పతనం నేను చెప్పడం కూడా అంతే’అన్నాడు ఎన్టీయార్. నిజంగా తారక్ ప్రసంగం... అక్కడున్నవారందరినీ ఆలోచింపజేసింది. తనలో అద్భుతమైన పరిపక్వత కనిపిస్తోందని అందరూ అభినందిస్తున్నారు.