Read more!

English | Telugu

'ఆర్ఆర్ఆర్' కాదు.. ఆస్కార్స్ కి ఆ సినిమాని పంపండి!

'ఆర్ఆర్ఆర్' సినిమాని ఇండియా తరఫున ఆస్కార్స్ కి పంపిస్తే సత్తా చాటే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు వంటి విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి పంపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొందరు మాత్రం 'ఆర్ఆర్ఆర్'కి బదులుగా 'ది కాశ్మీర్ ఫైల్స్'ని ఆస్కార్స్ కి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన హింసాకాండను కళ్ళకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. 'ఆర్ఆర్ఆర్' విజువల్ వండర్ అయ్యుండొచ్చు, కానీ 'కాశ్మీర్ ఫైల్స్' హృదయాన్ని తాకేలా వెండితెరపై చూపించిన నిజమని.. అందుకే ఆస్కార్స్ కి ఈ చిత్రాన్ని పంపితే గౌరవంగా ఉంటుందని కొందరు అంటున్నారు. 

ఆస్కార్ ఎంట్రీ కోసం ఇండియా నుంచి 'కాశ్మీర్ ఫైల్స్'ని కాకుండా 'ఆర్ఆర్ఆర్'ని పంపాలని ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా ఈ చర్చకు దారి తీశాయి. 'ఆర్ఆర్ఆర్', 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాలలో ఆస్కార్స్ కి వెళ్ళే అర్హత దేనికి ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు 'ఆర్ఆర్ఆర్'కి మద్దతు ఇస్తుండగా, మరికొందరు 'ది కాశ్మీర్ ఫైల్స్'కి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రస్తుతం 'కాశ్మీర్ ఫైల్స్' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.