English | Telugu
కొత్త వివాదాన్ని సృష్టించిన ‘ఐసి 814’.. ఓటీటీ సంస్థలకు చెక్ పెట్టిన సుప్రీమ్ కోర్టు!
Updated : Sep 11, 2024
ఆగస్ట్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘ఐసి 814.. ది కాందహార్ హైజాక్’ కొత్త వివాదానికి తెర తీసింది. ఈ వెబ్ సిరీస్‌పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు న్యాయవాదులు దీనిపై సుప్రీమ్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాందహార్ కిడ్నాపర్లకు హైప్ తీసుకొచ్చేందుకు ఈ వెబ్ సిరీస్‌లో ప్రయత్నం జరిగిందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ దుర్ఘటనను ఒక హాస్యాస్పదమైన కథనంగా మార్చేందుకు, ఉగ్రవాద చర్యలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నం జరిగిందని తెలిపారు. అంతేకాదు హిందువులను కించ పరచడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ను రూపొందించారని తమ ఫిర్యాదులో తెలియజేశారు.
ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ఓటీటీతోపాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లను కంట్రోల్ చేసేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నారు.
ఓటీటీల్లో వచ్చే ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వస్తున్న కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు, వాటిని నియంత్రించేందుకు ఎలాంటి సంస్థలు అందుబాటులో లేవని అన్నారు. తమ పిటిషన్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, కుటుంబ ఆరోగ్యశాఖ, మహిళా శిశు అభివృద్ధి, రక్షణ మంత్రిత్వ శాఖ, టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియాలను పార్టీలుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన సుప్రీమ్ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఓ సూచన చేసింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న వీడియోలను పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు సెంట్రల్ బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఆన్‌లైన్ వీడియో కంటెంట్ అనే స్వయం ప్రతిపత్త సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.